24th September is director Srinu White’s birthday: కామెడీతో కబడ్డీ ఆడేస్తూ, యాక్షన్ తో జనాన్ని ఆకట్టుకుంటూ, సెంటిమెంట్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేస్తూ పలు ఫీట్లు చేశారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంటే షడ్రుచోపేత భోజనంతో సమానం అనుకోవాల్సిందే! అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే రీతిలో శ్రీనువైట్ల తన చిత్రాలను తెరకెక్కించి అలరించేవారు. జయాపజయాలు దైవాధీనం అన్నట్టుగా ఆయన అనూహ్య విజయాలనూ చూశారు. కొన్ని పరాజయాలతోనూ పయనించారు. అయినా ఈ నాటికీ జనం శ్రీను వైట్ల సినిమా అంటే నవరసభరితంగా ఉంటుందని భావిస్తూనే ఉన్నారు. శ్రీను వైట్ల మాత్రం అదుగో ఇదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప మరో సినిమాతో మురిపించడం లేదు.
శ్రీను వైట్ల 1972 సెప్టెంబర్ 24న తూర్పు గోదావరి జిల్లా కందుల పాలెంలో జన్మించారు. కొందరు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన శ్రీను వైట్ల తొలుత రాజశేఖర్ హీరోగా `అపరిచితుడు` అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. అయితే అనుకోని కారణాల వల్ల ‘అపరిచితుడు’ ప్రేక్షకులకు పరిచయం కాకుండానే పోయాడు. తరువాత రవితేజ హీరోగా `నీ కోసం` చిత్రం తెరకెక్కించారు. ఆ సినిమా విడుదల కోసం పలు పాట్లు పడ్డారు. ఉషాకిరణ్ సంస్థ `నీ కోసం`ను జనం ముందు నిలిపింది. దాంతో శ్రీను వైట్ల దర్శకత్వ ప్రతిభ ఏమిటో జనానికి తెలిసింది. తరువాత ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన `ఆనందం`తో భలేగా ఆకట్టుకున్నారు శ్రీను వైట్ల. రవితేజ `వెంకీ`లో శ్రీను వైట్ల కామెడీతో జనం కడుపులు చెక్కలు చేశారు. యాక్షన్, థ్రిల్స్ తోనూ మురిపించారు.
చిరంజీవితో శ్రీను వైట్ల తెరకెక్కించిన `అందరివాడు` ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. శ్రీను పని అయిపోయిందని చాలామంది భావించారు. ఆ సమయంలో `ఢీ`తో బాక్సాఫీస్ ను ఢీడిక్కిలాడించారు. ఆ తరువాత `రెడీ`తో రామ్ కు మరపురాని విజయం అందించారు. “దుబాయ్ శీను, నమో వెంకటేశ, కింగ్“ చిత్రాలలో శ్రీను పూయించిన నవ్వులను ఇప్పటికీ జనం ఏరుకుంటూనే ఉన్నారు. మహేశ్ బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన తొలి చిత్రం `దూకుడు` బాక్సాఫీస్ వద్ద నిజంగానే దూకుడు చూపింది. ఆ సినిమా తరువాత శ్రీను వైట్ల రేంజ్ మారిపోయింది. ఆ తరువాత శ్రీను దర్శకత్వంలో “బాద్ షా, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ“ రూపొందినా, మళ్ళీ `దూకుడు` నాటి మ్యాజిక్ సాగలేదు. ‘ఢీ’కి సీక్వెల్ రూపొందిస్తామని కొన్నేళ్ళ క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు అది రూపు దాల్చలేదు. 2018 నవంబర్ 16న శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోని’ విడుదలయింది. అప్పటి నుంచీ ఇప్పటి దాకా శ్రీను వైట్ల చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. ఆయన నుండి మరో నవ్వుల తేరు వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి.