బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ “నేడు సోనూసూద్ దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా మారారు. సహాయం కోసం తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సోను సూద్ సహాయం చేస్తాడు. నేడు పాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. అలాంటిది సోను సూద్ సాయం చేస్తున్నారు. మేము ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే ఓ మంచి పని కోసం సోనూ సూద్‌తో మాట్లాడాము” అని అన్నారు. దీంతో పంజాబ్ ఎన్నికల్లో సోనూసూద్ ప్రచారానికి సంబంధించిన అన్ని ఊహాగానాలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముగింపు పలికారు. కేజ్రీవాల్ ఢిల్లీలో ‘దేశ్ కే మెంటర్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. సోనూ సూద్ “దేశ కే మెంటర్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.
Read Also : మిడ్ నైట్ సర్ప్రైజ్… “సీటిమార్” అంటున్న దర్శకుడు
సోను సూద్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో చాలా మంది వ్యక్తులతో కనెక్ట్ అయినప్పుడు మన దగ్గర విద్య ఒక పెద్ద సమస్య అని తెలిసింది. ఈ మధ్య తలెత్తుతున్న మరో పెద్ద ప్రశ్న ఏమిటంటే ఎంతోకొంత తరువుకున్న తరువాత పిల్లలకు ఏమి చేయాలో తెలియదు. కుటుంబంలో వారికి చెప్పడానికి ఎవరూ లేరు. పిల్లలకు విద్యను అందించడం ముఖ్యమే కానీ వారికి సరైన దిశానిర్దేశం చేసేవారు కూడా ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమం పిల్లలకు మార్గనిర్దేశం చేసే ప్రయత్నం అవుతుంది. పిల్లలకు గురువుగా మార్గనిర్దేశనం చేయడానికి బాగా చదువుకున్న వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం దేశం కోసం ఏదో ఒకటి చేయడానికి ఈ వేదికను సృష్టించింది. మీరు ముందుకు వచ్చి కొంతమంది పిల్లలను ఎన్నుకోండి. మీరు మార్గనిర్దేశం చేసి దేశానికి మంచి భవిష్యత్తును అందించవచ్చు. అంతేకాకుండా వలస కార్మికులు, వాళ్ళ సమస్యలు, ఉద్యోగాలు వంటి విషయాలను, నిరుద్యోగుల కోసం ఆయన క్రియేట్ చేసిన “ప్రవాసీ రోజాగర్” యాప్ పని విధానాన్ని కూడా సీఎం కేజ్రీవాల్ కు వివరించారట సోను.
ఇక తన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై సోనూ మాట్లాడుతూ మంచి పని చేస్తున్నారు కాబట్టి రాజకీయాల్లోకి రండి అని ప్రజలు కోరుతున్నారని, కానీ ఏదైనా మంచి పనికి చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని అన్నారు. నాకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కానీ నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయాల గురించి సిఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడలేదు. పంజాబ్‌లో ప్రచారం గురించి కూడా తాను ఏమీ ఆలోచించలేదని చెప్పాడు.