Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది. అప్పట్లో దానిపై చిన్న,పెద్ద నిర్మాతలంతా హర్షం వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. చాలా వరకూ చిన్న సినిమాలు నాలుగు వారాల లోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, తాటి సునీతతో కలిసి నిర్మించిన ‘శాకిని డాకిని’ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను ఓటీటీ కోసమే తీశామని దర్శకుడు సుధీర్ వర్మ గతంలో చెప్పారు. కానీ అతనితో విభేదించిన నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధపడి, ఈ నెల 16న మూవీని రిలీజ్ చేశారు. కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిన ‘శాకిని డాకిని’ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. సరిగ్గా రెండు వారాలు గడిచిందో లేదో…. ఇప్పుడీ సినిమాను ఇదే నెల 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్లాప్ అయిన సినిమా రెండోవారమే ఓటీటీలో వచ్చేస్తుందంటే ఇక జనాలు థియేటర్లకు ఎందుకు వెళతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
సదరు సినిమా ఫ్లాప్ అయితే పది, పదిహేను రోజులు ఓపిక పడితే ఇంటిలోనే ఉండి ఓటీటీలో చూసే అవకాశం లభిస్తే… వందలు ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్ళడంలో అర్థమే లేదన్నది వారి వాదన. అయితే… త్వరలో విడుదల కాబోయే చిన్న సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రెండో వారానికి ఓటీటీలో వస్తాయని తెలిసినప్పుడు… థియేటర్ లో చూడాలని అనుకున్న వారు కూడా మనసు మార్చుకుని కొద్ది రోజులు ఓపిక పట్టడానికే మొగ్గు చూపుతారు. ‘శాకిని డాకిని’ అనే కాదు… ఈ నెల 2న విడుదలైన ‘బుజ్జి ఇలారా’, గత నెల 31న వచ్చిన ‘కోబ్రా’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే సెప్టెంబర్ 8న వచ్చిన ‘కెప్టెన్’ మూవీ 30వ తేదీన, 2న వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ అక్టోబర్ 2న ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. మొత్తం మీద ఓటీటీలు చాపకింద నీరులా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియెన్స్ కు దూరం చేస్తున్నాయి.