మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్ లో కావడం మరో సంచలన వార్త అయిపోయింది. దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇంకా అగ్గిని రాజేసింది. మొత్తానికి వైల్డ్ ఫైర్ లా అంతకంతకూ పెరిగిపోయిన అంచనాలు అందుకునేలానే సమంత ఐటమ్ సాంగ్ ను మేకర్స్ పిక్చరైజ్ చేశారనిపిస్తోంది.
ఎర్రచందనం సిండికేట్ సభ్యులకు దాని లీడర్ మంగళం శీను ఇచ్చే పార్టీలో ఈ ఐటమ్ సాంగ్ వస్తుందని అంటున్నారు. ఇందులో హీరో అల్లు అర్జున్ తో పాటు విలన్ గా నటించిన సునీల్, అజయ్ ఘోష్, మరికొందరు నటులూ కనిపిస్తారట. సుక్కు – దేవిశ్రీ కాంబోలో వచ్చే ఐటమ్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుందనేది వారి ఫాన్స్ నమ్మకం. దానికి ఏమాత్రం ‘తగ్గేదేలే’ అన్నట్టుగానే ఈ పాట కూడా ఉంది. మగాళ్ళ మెంటాలిటీని తెలియచేస్తూ చంద్రబోస్ అద్భుతంగా ఈ పాట రాశారు.
ఊ అంటావా మామా వూవూ అంటావా మావా అని సాగే ఈ పాటలో మగాళ్ళ బుద్ధిని సుతిమెత్తని పదాలతో చంద్రబోస్ బాగానే ఎండకట్టాడు. ఈ ఐటమ్ సాంగ్ ను ఇంద్రావతి చౌహాన్ అనే గాయనితో ఏరి కోరి సుక్కు-దేవిశ్రీ పాడించారు. అలానే తమిళంలో పాపులర్ సింగర్, యాక్ట్రస్ ఆండ్రియా ఈ పాటను పాడింది. స్టార్ హీరోయిన్ సమంత తో స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య అదిరిపోయే మూమెంట్స్ ఇప్పించారు. లేటెస్ట్ రిలికల్ సాంగ్ లో విజువల్స్ లేకపోయినా… ఆ ఫోటోలను బట్టి, ఆ భంగిమలను బట్టి ఈ పాట థియేటర్లలో మాస్ ను ఓ రేంజ్ లో ఊపేస్తుందని అనిపిస్తోంది. అందుకనే దీన్ని’ సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ రిలీజ్ కు ముందే ప్రచారం చేసేశారు.
