చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఇతర హీరోలు వద్దనుకున్న కథ మరో హీరోని చేరి సూపర్ హిట్ అవ్వడం అనేది కొత్తేమీ కాదు. అలాంటి చిత్రవిత్రాలు సినిమా రంగంలో ఎన్నెన్నో! అరవై ఏళ్ళ క్రితం ‘ప్రొఫెసర్’ కథ తొలుత దేవానంద్, తరువాత రాజ్ కపూర్ దరికి చేరింది. కానీ, ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎందుకనో ఆ కథను అంతగా మెచ్చలేదు. అదే కథ రాజ్ కపూర్ తమ్ముడు షమ్మీ కపూర్ చెంతకు చేరింది. ఆయనకు ఎంతగానో నచ్చింది. ఇంకేముంది దర్శకుడు లేఖ్ టండన్ తన తొలి చిత్రంతో షమ్మీ కపూర్ ను ‘ప్రొఫెసర్’గా జనం ముందు నిలిపారు. వారి మనసులు గెలిచారు. ఆ పై దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. షమ్మీ కపూర్ ‘ప్రొఫెసర్’గా నటించిన చిత్రం 1962 మే 11న రంగుల్లో రూపొంది జనాన్ని రంజింపచేసింది.
ఈ చిత్రకథ ఏమిటంటే – తన సోదరుని పిల్లలైన నీనా, రీటా అనే పడచు అమ్మాయిలకు, బంటీ, మున్ను అనే చిన్నారులకు సీతాదేవి వర్మ గార్డియన్ గా ఉంటుంది. డార్జిలింగ్ లో వారి నివాసం. ఎంతో కఠినంగా ఉంటూ, వారిని పెంచుతూ ఉంటుంది. వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పడానికి ఓ ప్రొఫెసర్ ను ట్యూటర్ గా నియమించాలని ఆశిస్తుంది. అయితే పడచు పిల్లలు కాబట్టి, ఆ ప్రొఫెసర్ కు యాభై ఏళ్ళ వయసు ఉండాలనీ నిబంధన విధిస్తుంది. నిరుద్యోగిగా ఉన్న ప్రీతమ్ ఖన్నా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని బాగు చేసుకోవడం కోసం వేరే దారిలేక యాభై ఏళ్ళ వయసు ఉన్న ప్రొఫెసర్ గా వేషం వేసుకొని, ఆ పిల్లలకు ట్యూటర్ గా చేరతాడు. ఆ ముసలి ప్రొఫెసర్ ను బయటకు నెట్టాలని, వాళ్ళ అత్తయ్య దృష్టిలో అతడిని దోషిగా నిలిపేందుకు అమ్మాయిలు పలు ప్రయత్నాలు చేస్తారు. కానీ, ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొడుతుంటాడు ప్రొఫెసర్. ఇక నీనాపై ప్రీతమ్ మనసు పారేసుకుంటాడు. ఆమెకు అసలు రూపంతో పరిచయమవుతాడు. ముసలి ప్రొఫెసర్ పై సీతాదేవి కూడా అనురాగం పెంచుకుంటుంది. అటు అత్త, ఇటు కోడలు- వీరి మధ్య ప్రీతమ్ వేషాలు. ఇలా సాగుతూ ఉండగా, ప్రీతమ్ వ్యవహారం బయట పడుతుంది. దాంతో సీతాదేవి నిలదీస్తుంది. అసలు విషయం చెబుతాడు. నీనా, తాను ప్రీతమ్ ను ప్రేమించానంటుంది. అతడు మోసగాడు అని సీతాదేవి వాదన. చివరకు అతని మంచిమనసు తెలిసి నీనా, ప్రీతమ్ ప్రేమను సీతాదేవి ఆమోదించడంతో కథ సుఖాంతమవుతుంది.
షమ్మీ కపూర్, సలీమ్ ఖాన్, కల్పన, లలితా పవర్, పర్వీన్ చౌదురి, ప్రతిమా దేవి, రషీద్ ఖాన్, బేలా బోస్, టున్ టున్, అమోల్ సేన్, ఇఫ్తేకార్, మూల్ చంద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చగా, శైలేంద్ర, హస్రత్ జైపురి పాటలు రాశారు. ఇందులోని “ఖులీ పలక్ మే ఝూటా గుస్సా…”, “యే గుల్బదన్… యే గుల్బదన్…”, “మై చలీ మై చలీ…”, “హమారే గావ్ కోయి ఆయేగా…”, “యే ఉమర్ హై…”, “ఆవాజ్ దేకే హమే తుమ్ బులావో…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. నిర్మాత ఎఫ్.సి. మెహ్రాకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయంతో దర్శకునిగా లేఖ్ టండన్ కు మంచి పేరు లభించింది. ఆ తరువాత షమ్మీకపూర్ తో శంకర్-జైకిషన్ స్వరకల్పనలోనే లేఖ్ టండన్ రూపొందించిన ‘ప్రిన్స్’ కూడా మంచి ఆదరణ పొందింది. ఆ పై లేఖ్ టండన్ దర్శకత్వంలో “ఆమ్రపాలి, ఝుక్ గయా ఆస్మాన్, జహా ప్యార్ మిలే, ఏక్ బార్ కహో, శారద, ఖుదా కసమ్” వంటి చిత్రాలు రూపొందాయి.
‘ప్రొఫెసర్’ సినిమా ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా 1969లో ‘భలే మాస్టారు’ అనే సినిమా తెరకెక్కింది. ఆ తరువాత ఇదే కథకు కొన్ని మార్పులు చేసి 1990లో సత్యరాజ్ హీరోగా తమిళ చిత్రం ‘నడిగన్’ రూపొంది విజయం సాధించింది. ఆ చిత్రం స్ఫూర్తితో తెలుగులో సుమన్ హీరోగా ‘పెద్దింటి అల్లుడు’ తయారై, విజయం చేజిక్కించుకుంది. ఈ కథతోనే కన్నడలో రవిచంద్రన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ‘గోపీకృష్ణ’ పేరుతో చిత్రం తెరకెక్కించారు. తరువాత షారుఖ్ ఖాన్ ‘ప్రొఫెసర్’ రైట్స్ తీసుకున్నారు. ఈ కథతో షారుఖ్ సినిమా తీయలేదు. కానీ, ఇప్పటికీ ‘ప్రొఫెసర్’ రీమేక్ రైట్స్ షారుఖ్ కు చెందిన ‘రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్’ దగ్గరే ఉన్నాయి.