Sixty Years For Mahamantri Timmarusu : కథాబలం ఉండాలే కానీ, టైటిల్ ఏదైనా, ఎవరిపై ఉన్నా వెనుకాముందు ఆలోచించకుండా నటించేవారు నటరత్న యన్.టి.రామారావు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యారనిపిస్తుంది. తన పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు ఇట్టే సినిమాను అంగీకరించడం నటరత్న అలవాటు. అలా ఆయన అనేక చిత్రాలలో టైటిల్ రోల్ ఇతరులపై ఉన్నా, తన పాత్రను తాను పోషించి మెప్పించారు. అలా ఒప్పించిన చిత్రాలలో ‘మహామంత్రి తిమ్మరుసు’ కూడా చోటు దక్కించుకుంది. యన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా, గుమ్మడి మహామంత్రి తిమ్మరుసుగా నటించిన ఈ చిత్రం కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందింది. గౌతమి ప్రొడక్షన్స్ పతాకంపై ‘మహామంత్రి తిమ్మరుసు’ను యన్.రామబ్రహ్మం, ఎ.పుండరీకాక్షయ్య నిర్మించారు. 1962 జూలై 26న విడుదలైన ‘మహామంత్రి తిమ్మరుసు’ విజయభేరీ మోగించింది.
శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి చారిత్రక ఆధారాలతో ఈ చిత్రం రూపొందింది. దాసీపుత్రుడుగా అవమానాల పాలయిన శ్రీకృష్ణదేవరాయలును ‘అప్పాజీ’గా జనం చేత జేజేలు అందుకున్న తిమ్మరుసు పెంచిపెద్ద చేసి, విద్యాబుద్ధులు, యుద్ధవిద్యలు అబ్బేలా చూస్తారు. రాయలు ఏ తప్పుదారిలో నడచినా, దానిని సరిదిద్దుతూ ఉంటారు అప్పాజీ. కళారాధకుడైన కృష్ణరాయలు, తన గానానికి సరితూగేలా నాట్యంచేసిన చిన్నాదేవిని ప్రేమిస్తాడు. పెళ్ళాడతాడు. అయితే ఆమెకు అతనే రాయలు అని తెలియదు. అప్పాజీ వచ్చి పరీక్షించి, ఆమె మంచి తనాన్ని గుర్తిస్తాడు. తరువాత శ్రీరంగపట్నం రాకుమారి అయిన తిరుమలదేవితో రాయలకు పెళ్ళవుతుంది. రాయలవారి పట్టాభిషేకం జరుగుతుంది. తనను చిన్నచూపు చూస్తున్న గజపతులపైకి మెరుపుదాడి చేస్తాడు రాయలు. ప్రతాపరుద్ర గజపతి, తన కొడుకు వీరభద్ర గజపతిని రాయలపైకి పంపిస్తాడు. అయతే రాయలు, వీరభద్రుడిని ఓడించి, బందీగా పట్టుకుంటాడు. అతడిని విడిపించుకు రావడానికి ప్రతాపరుద్ర గజపతి తమ్ముడు హమ్ వీరుడు ఓ పథకం ప్రకారం తమ అమ్మాయి అన్నపూర్ణ దేవిని రాయలుకు ఇచ్చి కళ్యాణం కావిస్తారు. శోభనం రాత్రిన రాయలును మట్టుపెట్టమని చెబుతారు. కానీ, ఆమె రాయలుపై ప్రేమాభిమానాలతో ఆ పని చేయదు. హమ్ వీరుడు విజయనగరంలోనే ఉంటాడు. రాయలు, తిమ్మరుసు మధ్య దూరం పెంచడానికి తన అన్న కూతురు అన్నపూర్ణకు లేనిపోనివి చెబుతూ ఉంటాడు హమ్ వీరుడు. ఆమె కూడా అప్పాజీని కన్నతండ్రిలా భావిస్తూ. పినతండ్రి మాటలను తోసిపుచ్చుతూ ఉంటుంది. రాయలు, అన్నపూర్ణదేవికి ఓ బాబు పుడతాడు. ఆ పసిపిల్లాడిని ఓ పథకం ప్రకారం చంపేస్తాడు హమ్ వీరుడు. అది అప్పాజీపైకి వచ్చేలా చూస్తాడు. దాంతో విజయనగర సామ్రాజ్య నిబంధనల ప్రకారం కృష్ణరాయలు, నేరస్థునికి కళ్ళు పొడవమని ఆజ్ఞాపిస్తాడు. అప్పాజీ కళ్ళు పొడవడానికి భటులు జంకుతారు. రాజాజ్ఞ ధిక్కరించరాదని, పాటించమని చెబుతాడు అప్పాజీ. అయితే చారుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న కృష్ణరాయలు, హమ్ వీరుని, వీరభద్రభూపతిని అంతమొందిస్తాడు. చెరసాలలో ఉన్న అప్పాజీ దగ్గరకు వచ్చేసరికే ఆయన అంధుడై పోయి ఉంటాడు. తనను క్షమించమని అప్పాజీని ప్రాధేయపడతాడు రాయలు. మన్నించిన అప్పాజీ, అంధుడైనా మళ్ళీ మంత్రిగా బాధత్యలు స్వీకరించడంతో కథ ముగుస్తుంది.
దేవిక, యస్.వరలక్ష్మి, యల్.విజయలక్ష్మి నాయికలుగా నటించిన ఈ చిత్రంలో రేలంగి, లింగమూర్తి, ముక్కామల, శోభన్ బాబు, రాజశ్రీ, రాధాకుమారి, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, ఏ.వి.సుబ్బారావు, మల్లాది, వల్లం నరసింహారావు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు సమకూర్చారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు. “తిరుమల తిరుపతి వేంకటేశ్వరా…”, “ఆంధ్రాదేవా…”, “జయ జయ జయ…”, “జయవాణీ చరణ కమల…”, “లీలాకృష్ణ నీ లీలలు…”, “మోహనరాగమహా…”, “తధాస్తు స్వాముల కొలవండి…”, “జయ అనరే జయ అనరే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొంది.
‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు లభించింది. ఇందులో తిమ్మరుసు పాత్ర పోషించిన గుమ్మడికి ప్రశంసా పత్రం దక్కింది. భారత తొలిప్రధాని నెహ్రూ ఈ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. నెహ్రూ చివరిసారిగా పాల్గొన్న ప్రైవేట్ ఫంక్షన్ అదే కావడం గమనార్హం! ఈ చిత్రానికి ముందు యన్టీఆర్ ‘తెనాలి రామకృష్ణ’లోనూ శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. అందులో తెనాలి రామకృష్ణ టైటిల్ రోల్ ను తెలుగులో ఏయన్నార్, తమిళంలో శివాజీగణేశన్ ధరించారు. ఇక ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రం కన్నడ సీమలోనూ విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రం విడుదలైన ఎనిమిది సంవత్సరాలకు 1970లో బి.ఆర్.పంతులు కన్నడలో ‘శ్రీకృష్ణదేవరాయ’ పేరుతో దాదాపు ఇదే కథాంశాన్ని కలర్ లో తెరకెక్కించారు. అందులో రాయలుగా రాజ్ కుమార్, చిత్ర దర్శకనిర్మాత బి.ఆర్.పంతులు అప్పాజీగా నటించారు. తాను తప్పు చేశానని బాధపడుతూ కృష్ణరాయలు, తాను ఉన్నా విజయనగరసామ్రాజ్యంలో తప్పు దొర్లి, రాయలు నిందితునిగా మిగిలిపోయాడని అప్పాజీ చింతిస్తూ ఉంటారు. చివరకు అప్పాజీ కన్నుమూయగా, రాయలు అంత్యక్రియలు జరిపించడం, ఆ పై తిరుమలకు సతీసమేతంగా వెళ్ళి రాయలు స్వామివారిని సేవించారని, దేవేరులుతో రాయలవారి విగ్రహాలు ఈ నాటికీ తిరుమల మందిరంలో ఉన్నాయని చెబుతూ ఆ సినిమా ముగుస్తుంది. రంగుల్లో రూపొందిన ‘శ్రీకృష్ణదేవరాయలు’ సైతం మంచి విజయం సాధించింది. అయితే కన్నడ సీమలోనూ ‘మహామంత్రి తిమ్మరుసు’ రిపీట్ రన్స్ తోనూ జయకేతనం ఎగురవేయడం విశేషం!