నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావుకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే! తరువాతి రోజుల్లో వారిద్దరూ వియ్యంకులు అయ్యారు. వారిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇల్లరికం’ అప్పటికే విజయఢంకా మోగించింది. తరువాత ఏయన్నార్ తో సుబ్బారావు నిర్మించిన ‘భార్యాభర్తలు’ సైతం విజయం సాధించింది. ‘భార్యాభర్తలు’ ద్వారా కె.ప్రత్యగాత్మను దర్శకునిగా పరిచయం చేశారు. ఆ సినిమా విజయంతో మరుసటి సంవత్సరమే ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే ఏయన్నార్ హీరోగా ‘కులగోత్రాలు’ నిర్మించారు సుబ్బారావు. 1962 ఆగస్టు 24న విడుదలైన ‘కులగోత్రాలు’ కూడా విజయపథంలో పయనించింది. అలా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో ఏయన్నార్ కు ‘కులగోత్రాలు’ హ్యాట్రిక్ మూవీగా నిలచింది.
‘కులగోత్రాలు’ టైటిల్ చూడగానే ఇది కులగోత్రాలకు ప్రాముఖ్యమిచ్చే కథాంశమని ఇట్టే తెలిసి పోతోంది. అదే తీరున సినిమా కూడా తెరకెక్కింది. ధనవంతుడైన భూషయ్యకు రవి అనే కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. కొడుకంటే తల్లిదండ్రులకు ప్రాణం. కాలేజ్ లో రవి, సరోజ అనే అమ్మాయి ప్రేమించుకుంటారు. సరోజ తల్లిని చలపతి అనేవాడు మోసం చేసి ఉంటాడు. దాంతో సరోజకు కులగోత్రాలు లేవని జనం అంటారు. ఆ చలపతి దొంగతనాలు చేసుకుంటూ జీవిస్తూవుంటాడు. ఆ విషయం సరోజకూ తెలుస్తుంది. తండ్రికి ఇష్టం లేకపోయినా ప్రేమించిన సరోజను పెళ్ళాడతాడు రవి. భూషయ్య కులగోత్రాలు లేని పిల్లను పెళ్ళాడావని రవిని దూషిస్తాడు. వేరే కాపురం పెడతారు రవి, సరోజ. అదే ఊరిలో రవికి పోలీస్ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగం లభిస్తుంది. రవికి ఓ కొడుకు పుడతాడు. ఎప్పుడైనా ఆస్తి రవికి పోతుందేమోనని, భూషయ్య పెద్దకూతురు జగదంబ, పెద్దల్లుడు సదానందం తమకు ఆస్తి రాసివ్వమని బలవంతం చేస్తారు. భూషయ్య అల్లునికి తోడుగా చలపతి, అతని మనుషులు వస్తారు. ఇనుపపెట్టె తాళాలు ఇవ్వమని భూషయ్యను ఇంట్లోవాళ్ళను కట్టేసి కొడుతూ ఉంటాడు చలపతి. భూషయ్య చిన్నల్లుడు జోగారావు ద్వారా రవికి విషయం తెలుస్తుంది. పోలీసు స్టేషన్ కు వెళ్ళి, డ్యూటీ మీద రవి ఇంటికి వస్తాడు. చలపతి, రవి పోట్లాడతారు. రవిని చలపతి కత్తితో చంపబోతుండగా సరోజ వచ్చి అతణ్ణి రివాల్వర్ తో కాలుస్తుంది. చనిపోతూ కూతురు సరోజను తన కారణంగా శిక్షించకండి అంటూ చెబుతాడు చలపతి. భూషయ్య తన తప్పు తెలుసుకొని, కులం కంటే గుణం ప్రధానమని తెలిసి కొడుకు, కోడలును మన్నించమని కోరతాడు. భూషయ్య మనవడిని చూసి మురిసిపోవడంతో కథ సుఖాంతమవుతుంది.
కృష్ణకుమారి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, మిల్కిలినేని, జి.వరలక్ష్మి, గిరిజ, సూర్యకాంతం, సంధ్య, నిర్మల ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి ఆత్రేయ మాటలు రాయగా, కొసరాజు, శ్రీశ్రీ, నారాయణరెడ్డి, దాశరథి పాటలు పలికించారు. యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇందులోని “చెలికాడు నిన్నే రమ్మని పిలువా…”, “చిలిపి కనుల తీయని చెలికాడా…”, “అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే…”, “మామా శత్రుభయంకర నామా…”,”రావయ్యా మా ఇంటికి…”, “రావే రావే బాలా…”, “నీ నల్లని జడలో పూలు…”, “సఖీ శకుంతలా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రంగా ‘కులగోత్రాలు’ నిలచింది. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్స్ లో ఒకరిగా కృష్ణ కాసేపు తెరపై కనిపించారు. అంతకు ముందు ‘పదండి ముందుకు’లోనూ కృష్ణ ఓ బిట్ రోల్ లో నటించారు. అప్పట్లో ఉత్తమ చిత్రాలకు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్స్ ప్రదానం చేసేవారు. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా ప్రశంసాపత్రం లభించింది. అదే యేడాది విడుదలైన ‘మహామంత్రి తిమ్మరుసు’ ప్రథమ బహుమతి అందుకుంది. ‘కులగోత్రాలు’ మంచి విజయం సాధించి, శతదినోత్సవాలు చూసింది. రిపీట్ రన్స్ లోనూ అలరించింది.