సౌతిండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 10వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి రంగం సిద్థమౌతోంది. ఈసారి ఈ వేడుకను సెప్టెంబర్ 10, 11 తేదీలలో బెంగళూరులో జరుపబోతున్నారు. ఈ సందర్భంగా సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2021లో విడుదలైన నాలుగు భాషలకు చెందిన సినిమాల సైమా నామినేషన్స్ గురించి తెలిపారు. తెలుగు నుండి ‘పుష్ప’, తమిళ నుండి ‘కర్ణన్’, కన్నడ నుండి ‘రాబర్ట్’, మలయాళం నుండి ‘మిన్నల్ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్ పొందాయని అన్నారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం ఏకంగా 12 నామినేషన్స్ తో అగ్రస్థానంలో నిలించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ మూవీ 10 నామినేషన్స్ తో రెండో స్థానంలోనూ, ‘ఉప్పెన, జాతి రత్నాలు’ చిత్రాలు ఎనిమిదేసి నామినేషన్స్ తో మూడో స్థానంలోనూ నిలిచాయి. తమిళం విషయానికి వస్తే… మారి సెల్వరాజ్ ‘కర్ణన్’కు పది నామినేషన్స్ దక్కగా, నెల్సన్ ‘డాక్టర్’ మూవీ తొమ్మిది నామినేషన్స్ తో ద్వితీయ స్థానంలోనూ, ‘మాస్టర్’, ‘తలైవి’ చిత్రాలు ఏడేసి నామినేషన్స్ తో మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఇక కన్నడ రంగం విషయానికి వస్తే తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ‘రాబర్ట్’ మూవీ 10 నామినేషన్స్ లో ఫస్ట్ ప్లేస్ లోనూ, రాజ్ బి శెట్టి డైరెక్ట్ చేసిన ‘గరుడ గమన వృషభ వాహన’ 8 నామినేషన్స్ తో ద్వితీయ స్థానంలోనూ, ‘యువరత్న’ మూవీ 7 నామినేషన్స్ తో తృతీయ స్థానంలోనూ ఉన్నాయి. మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళీ’ పది నామినేషన్స్ ప్రథమస్థానంలో నిలువగా, ‘కురూప్’ 8 నామినేషన్స్ తో రెండో స్థానంలో నిలిచాయి. ఇక ఫహద్ ఫాజిల్ నటించిన ‘మాలిక్’, ‘జోజి’ చిత్రాలు ఒక్కొక్కటి ఆరేసి నామినేషన్స్ తో మూడో స్థానం దక్కించుకున్నాయి. ‘ఈ మొత్తం నామినేషన్స్ నుండి విన్నర్స్ ను ఆన్ లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి అవార్డులను అందిస్తామని, ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్ సైట్ కు వెళ్ళి ఓటు వేయాల్సి ఉంటుంద’ని బృందా ప్రసాద్ తెలిపారు.