1986లో ‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలూ రాస్తూ, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు సీతారామశాస్త్రి. 2021 నవంబర్ 30న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రం ఏమంటే… ‘సిరివెన్నెల’తో మొదలైన ఆయన సినీ గీత ప్రస్థానం తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కోసం రాసిన పాటలో సిరివెన్నెల ప్రస్తావనతో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.
విశేషం ఏమంటే… తన పాటల్లో సిరివెన్నెల అనే పదాన్ని సీతారామశాస్త్రి ఎప్పుడు ప్రాధాన్యమిచ్చి వాడలేదు. కానీ ఇవాళ విడుదలైన పాటను ఎత్తుకోవడమే ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’ అని మొదలు పెట్టారు. పాటలోని ప్రతి పదంలోనూ సిరివెన్నెల సీతారామశాస్త్రి ముద్ర కనబడుతూ సాగింది. దీనిని వినగానే దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ‘మీ తొలిచిత్రం పేరును ఈ పాటలో పెట్టారేమిటీ?’ అని ప్రశ్నించాడట. ‘బహుశా ఇదే నా చివరి పాట కావచ్చు’ అని సీతారామశాస్త్రి గట్టిగా నవ్వేస్తూ అన్నారట. నవంబర్ 4వ తేదీ దీపావళిన ఆ పాటను సీతారామశాస్త్రి పూర్తి చేయగా, డిసెంబర్ 1న సీతారామశాస్త్రి అంత్యక్రియల రోజున ఈ పాటను ‘శ్యామ్ సింగరాయ్’ టీమ్ రికార్డ్ చేసింది.
నాని, సాయిపల్లవిపై చిత్రీకరించిన వీనుల విందైన ఈ గీతాన్ని సీతారామశాస్త్రి అద్భుతంగా రాయగా, అంతే గొప్పగా మిక్కీ జే మేయర్ స్వర రచన చేశారు. దీన్ని అనురాగ్ కులకర్ణి చక్కగా గానం చేశారు. ‘సిరివెన్నెల చివరి సంతకం’ పేరుతో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది. కృతీశెట్టి, మడోన్నా సబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీని వెంకట్ బోయినపల్లి నిర్మించారు. ఈ నెల 24న సినిమా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.