NTV Telugu Site icon

Koratala Shiva: కొరటాల శివ.. ఆ పని చేయవలసిందేనా!?

Koratala

Koratala

Koratala Shiva: జూనియర్ యన్టీఆర్ సోలో హీరోగా ‘అరవింద సమేత’ తరువాత సినిమా వచ్చి దాదాపు ఐదేళ్ళవుతోంది. మధ్యలో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ లేకపోతే ఏంటి పరిస్థితి అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పైగా జూనియర్ తరువాతి చిత్రం వెలుగు చూసేది వచ్చే యేడాదే! కాబట్టి ఐదేళ్ళ గ్యాప్ తరువాత వచ్చే యంగ్ టైగర్ సినిమా ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? అన్న అంశాలపై అభిమానుల్లో చర్చ
సాగడం సర్వసాధారణమే! అయితే ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ. కాబట్టి రాబోయే సినిమా అటు యన్టీఆర్ కు, ఇటు కొరటాల శివకు ఇద్దరికీ లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఐదేళ్ళ గ్యాప్ తరువాత యన్టీఆర్ లాంటి మాస్ హీరో నుండి వచ్చే సినిమా అభిమానులనే కాదు, అన్ని వర్గాలను ఆకట్టుకొనేదై ఉండాలి. అందువల్ల హీరో అన్ని కోణాల్లోనూ ఆకట్టుకొనే కథతో జనం ముందుకు రావాలి. ఇక డైరెక్టర్ కొరటాల విషయానికి వస్తే, ఈయన ముందు సినిమా ‘ఆచార్య’ మల్టీస్టారర్ అయినప్పటికీ అపజయం పాలయింది. దీంతో కొరటాల తనను తాను ప్రూవ్ చేసుకొని తీరాలి. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు పలు హంగులు అద్దుతూ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిది – ఇది యన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం! ఇందులో నాయికగా ఓ నాటి యన్టీఆర్ హిట్ పెయిర్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఎంచుకున్నారు. తాత జోడీ కూతురుతో మనవడు జంటగా నటించడం విశేషమే కదా!

Elon Musk:ఎలాన్ మస్క్ పై ఆస్కార్ విన్నర్ డాక్యుమెంటరీ!

యన్టీఆర్ తో శ్రీదేవి నటించిన తొలి చిత్రం ‘వేటగాడు’తోనే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన సంగతి తెలిసిందే! ఈ కోణంలో ఆలోచించినా, జూనియర్ తో జాన్వీ నటించబోయే తాజా చిత్రంతోనే ఓ బంపర్ హిట్ పట్టేయాలి. లేకపోతే తేడాలొచ్చేస్తాయ్? యన్టీఆర్ మనవడు జూనియర్, శ్రీదేవి కూతురు జాన్వీ జోడీ అంటూ ఉంటేనే అభిమానుల్లో ఆనందం అంబరమంటుతోంది. ఆ ఆనందాన్ని మరింత పెంచాలంటే కొరటాల శివ కొన్ని సూత్రాలు అనుసరించవలసిందే! ఇందుకోసం ‘వేటగాడు’ రూపశిల్పి కె.రాఘవేంద్రరావు ఉన్నారు. యన్టీఆర్, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు చేసిన మ్యాజిక్ ను ఎవరూ మరచిపోలేరు. అందువల్ల కొరటాల శివ ఖచ్చితంగా రాఘవేంద్రరావు వద్దకు వెళ్ళి యన్టీఆర్, జాన్వీ జోడీని ఏ తీరున తెరపై ఆవిష్కరిస్తే, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేయవచ్చునో సలహాలు తీసుకుంటే మంచిదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అసలే ‘ఆచార్య’ అపజయంతో కుంగి ఉన్న కొరటాల శివ, తన సీనియర్ డైరెక్టర్ సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదనీ సినీజనం సైతం అంటున్నారు. ఓ సీనియర్ డైరెక్టర్ ను జూనియర్స్ వెళ్ళి సలహాలు అడగడం అన్నది కొత్తేమీ కాదు. కావున… కొరటాల ఆ దిశగా అడుగులేస్తారేమో చూడాలి!

Show comments