Shobhan Babu: తన చిత్రాల ద్వారా చిత్రసీమకు పరిచయం అయిన వారిని ప్రోత్సహించడంలో నటరత్న యన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారు. తెలుగునాట అందాల నటుడు అన్న పేరు సంపాదించిన యన్టీఆర్, శోభన్ బాబును ఎంతగానో ప్రోత్సహించారు. యన్టీఆర్ హీరోగా 1959లో రూపొందిన ‘దైవబలం’ చిత్రం ద్వారానే శోభన్ బాబు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. అందువల్ల యన్టీఆర్, శోభన్ ను ఆ తరువాత కూడా బాగా ప్రోత్సహించారు. తరువాతి రోజుల్లో శోభన్ బాబు సైతం ‘అందాల నటుడు’ అని పేరు సంపాదించడం విశేషం!
తాను దర్శకత్వం వహించిన ‘సీతారామకళ్యాణం, శ్రీక్రిష్ణపాండవీయం’ చిత్రాలలో శోభన్ బాబుతో కీలక పాత్రలు పోషింప చేశారు యన్టీఆర్. అంతేకాదు, తన నిర్మాతలకూ శోభన్ బాబును రికమెండ్ చేసేవారు. యన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందిన “సీతారామ కళ్యాణం, భీష్మ, మహామంత్రి తిమ్మరుసు, ఇరుగు-పొరుగు, లవకుశ, నర్తనశాల, కర్ణన్, దేశద్రోహులు, ప్రమీలార్జునీయం, వీరాభిమన్యు, శ్రీక్రిష్ణపాండవీయం, పరమానందయ్య శిష్యుల కథ, శ్రీకృష్ణావతారం, పుణ్యవతి, ఆడపడచు, విచిత్ర కుటుంబం, నిండు హృదయాలు, మాతృదేవత, పెత్తందార్లు, చిన్ననాటి స్నేహితులు, మాయని మమత” వంటి చిత్రాలలో శోభన్ బాబుకు మంచి పాత్రలే లభించాయి.
‘సీతారామకళ్యాణం’లో లక్ష్మణునిగా, ‘భీష్మ’లో అర్జునునిగా, ‘మహామంత్రి తిమ్మరుసు’లో గోవిందరాయలుగా, ‘లవకుశ’లో శత్రుఘ్నునిగా, ‘నర్తనశాల’, ‘వీరాభిమన్యు’ చిత్రాలలో అభిమన్యునిగా, ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో మరోమారు అర్జునునిగా, ‘పరమానందయ్య శిష్యుల కథ’లో శివునిగా, ‘శ్రీకృష్ణావతారం’లో నారదునిగా శోభన్ బాబును నటింప చేశారు రామారావు. ఈ చిత్రాలు శోభన్ కు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టడమే కాదు, ఆ రామన్నకు తగ్గ తమ్ముడు అనీ పేరొందేలా చేశాయి. తెలుగునాట శ్రీరాముని పాత్రలో తిరుగులేదని నిరూపించుకున్నారు యన్టీఆర్. ఆ అన్నకు తమ్ముడైన శోభన్ బాబు తరువాత బాపు ‘సంపూర్ణ రామాయణం’లో అదే శ్రీరాముని పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
తనను ఎంతగానో ప్రోత్సహించిన యన్టీఆర్ ను తన దైవంగా భావించేవారు శోభన్ బాబు. అందువల్లే యన్టీఆర్ భారీ చిత్రాన్ని తన ఇంటిలో పెట్టుకున్నారు శోభన్ బాబు. రామన్న తరువాత రాముడుగా నిలచిన శోభన్ బాబు కృష్ణుని వేషంలోనూ ఆయన తరువాత తానే అనిపించుకొనే ప్రయత్నం చేశారు. అలాగే అందాల నటుడుగానూ రామారావు తరువాత గుర్తింపు పొందారు శోభన్. బాపు ‘బుద్ధిమంతుడు’లో శ్రీకృష్ణుని పాత్రలో నటించారు శోభన్. ఆ తరువాత ‘కురుక్షేత్రం’లో శ్రీకృష్ణునిగానూ కనిపించారు. యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’ చిత్రం విడుదలైన రోజునే ‘కురుక్షేత్రం’ కూడా జనం ముందు నిలచింది. ‘దానవీరశూర కర్ణ’లో యన్టీఆర్ శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రల్లో నటించి అలరించారు. ఆ సినిమా ముందు ‘కురుక్షేత్రం’ నిలవలేక పోయింది. అలా కృష్ణుని పాత్రలో మాత్రం అన్న ముందు ఈ తమ్ముడు నిలవలేక పోయాడని శోభన్ బాబే చెప్పుకొనేవారు.
శోభన్ బాబు వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో యన్టీఆర్, ఆయన తమ్ముడు త్రివిక్రమరావు ఆయనను ఆర్థికంగానూ ఆదుకున్నారు. అలాగే యన్టీఆర్ సతీమణి బసవతారకం సైతం శోభన్ ను ఆదరించారు. అందువల్లే బసవతారకంను అమ్మగా భావించేవారు శోభన్. ఆమె మరణించిన సమయంలో ‘ఈనాడు’ దినపత్రికలో శోభన్ ఓ ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి అందులో భక్తిపూర్వకంగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు శోభన్. ఇలా అన్న రామారావుతో ఎంతో అనుబంధం ఉన్న శోభన్ బాబు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా, యన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెనాలిలో వారానికి ఐదు రోజులు ప్రదర్శితమవుతున్న యన్టీఆర్ చిత్రాలలో శోభన్ బాబు కనిపించినప్పుడు జనం ఆయనను కూడా తలచుకుంటూనే ఉన్నారు. ఏది ఏమైనా అందాలనటుడు అన్న పేరు సార్థకం చేసుకున్న యన్టీఆర్ కు తగ్గ తమ్మునిగా శోభన్ సైతం ‘అందాల కథానాయకుడు’ అనిపించుకున్నారు. 1937 జనవరి 14 న జన్మించిన శోభన్ బాబు.. 2008 మార్చిలో మృతి చెందారు.