Shivathmika Rajashekar: తండ్రి ఒకప్పుడు యాంగ్రీ మేన్ గా జేజేలు అందుకున్నారు. తల్లి సహజనటి, దర్శకురాలు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల కూతురు కూడా అదే తీరున సాగకుండా ఉండదు కదా! డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్నకూతురు శివాత్మిక కూడా అమ్మానాన్న బాటలోనే నటనలో అడుగుపెట్టింది. అంతకు ముందు ఆమె అక్క శివాని కూడా నటిగా మారింది. అయితే శివాత్మిక మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చూసిన వారెవరికైనా అందులో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించిన శివాత్మిక అభినయం నచ్చి తీరుతుంది. ఆ సినిమాతో నటిగా మంచి మార్కులు సంపాదించిన శివాత్మిక మరిన్ని చిత్రాల్లో నటించడానికి అంగీకరించింది.
శివాత్మిక 2000 ఏప్రిల్ 22న జన్మించింది. తల్లి, తండ్రి ఇద్దరూ సినిమా రంగంలోనే ఉన్నా, ఎంచక్కా చదువుకొని తండ్రి బాటలోనే పయనించి, డాక్టర్ అనిపించుకుంది. ఆ తరువాతే నటనను ఎంచుకుంది. శివాత్మిక నటించిన తొలి చిత్రం ‘దొరసాని’. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. ఆ సినిమాతోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది శివాత్మిక. తరువాత “పంచతంత్రం, ఆకాశం, రంగస్థలం” చిత్రాలలో నటించి మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. శివాత్మికకు అవకాశాలు బోలెడు వస్తున్నాయి. అయితే అన్నీ అంగీకరించకుండా, తన మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటించడానికి శివాని ఉత్సాహం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘విధివిలాసం’ అనే తెలుగు చిత్రంలోనూ, తమిళ సినిమా ‘ఆనందం విలైయాడుం వీడు’లోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ శివాత్మిక అభినయప్రాధాన్యమున్న పాత్రలే పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నటించిన కొన్ని చిత్రాలతోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శివాత్మిక మునుముందు మరిన్ని మంచి పాత్రలతో అలరించనుందని చెప్పవచ్చు.