Siva Kandukuri: ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ మూడేళ్ళ క్రితం ‘చూసి చూడంగానే’ మూవీతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతను నటించిన ‘గమనం’ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ రెండు సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు శివ కందుకూరి. అలానే తనలోని నటుడిని ఆవిష్కరించే క్రమంలో ‘మీట్ క్యూట్’ వెబ్ సీరిస్ లోనూ నటించాడు. ఇప్పుడు అతను మూడు నాలుగు సినిమాలలో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. అందులో ఒకటి ‘మను చరిత్ర’.
శివ కందుకూరి హీరోగా తెరకెక్కుతున్న ‘మను చరిత్ర’ మూవీలో మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ హీరోయిన్లుగా నటించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వరంగల్ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ స్టోరీగా ‘మను చరిత్ర’ను మలిచారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీ విజయ ఫిల్మ్స్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను పొందిన ఈ చిత్రాన్ని ఎన్. శ్రీనివాసరెడ్డి నిర్మించగా గోపీసుందర్ సంగీతాన్ని, రాహుల్ శ్రీవాత్స్వ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.