Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు

  • 94 ఏళ్ల వయసులో కన్నుమూత
  • తొలి సినిమాతోనే ‘షావుకారు’గా గుర్తింపు
  • 400కు చేరువగా చిత్రాల్లో నటన
  • పద్మశ్రీతో పాటు ఎన్నో పురస్కారాలు
Shavukaru Janaki

Shavukaru Janaki

Shavukaru Janaki : భారతీయ చిత్రసీమలో తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (94) చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి తరం వరకు దాదాపు 400 చిత్రాల్లో నటించి, అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె భౌతికకాయం నిష్క్రమించినప్పటికీ, వెండితెరపై ఆమె పోషించిన అమర పాత్రలు భారతీయ సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

రాజమండ్రి నుంచి వెండితెర వరకు సాగిన ప్రయాణం

1931 డిసెంబరు 12న రాజమండ్రిలో శంకరమంచి వెంకోజీరావు, శచీదేవి దంపతులకు జన్మించిన జానకి చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. 11వ ఏటనే రేడియో కార్యక్రమాల్లో పాల్గొని తన గళంతో అలరించిన ఆమె, అస్సాంలోని గౌహతిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కేవలం 15 ఏళ్ల పిన్న వయసులోనే 1947లో శంకరమంచి శ్రీనివాసరావుతో ఆమె వివాహం జరిగింది. కాగా, తెలుగు వెండితెరపై స్టార్ కథానాయికగా వెలిగిన కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు కాగా, వీరి మనవరాలు వైష్ణవి అరవింద్ కూడా పలు దక్షిణాది చిత్రాల్లో నటించారు.

తొలి సినిమాతోనే ‘షావుకారు’గా అమరిపోయిన పేరు

1949లో ‘రక్షరేఖ’ చిత్రంలో చిన్న పాత్రతో సినీ రంగప్రవేశం చేసినప్పటికీ, 1950లో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘షావుకారు’ చిత్రం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఇందులో ‘సుబ్బులు’ పాత్రలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. విశేషమేమిటంటే, నందమూరి తారకరామారావుకి కథానాయకుడిగా, జానకికి కథానాయికగా ఈ చిత్రమే తొలి ప్రయాణం కావడం విశేషం.

ఐదు భాషల్లో సత్తా.. నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన రికార్డు

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కలిపి దాదాపు 385కి పైగా చిత్రాల్లో నటించిన జానకి, అందులో 200కు పైగా సినిమాల్లో కథానాయికగా అలరించారు. ఎన్టీఆర్, అక్కినేని, ఎంజీఆర్, శివాజీ గణేశన్, డాక్టర్ రాజ్‌కుమార్ వంటి అగ్ర నటులందరి సరసన నటించి మెప్పించారు. ముఖ్యంగా తమిళంలో అత్యధికంగా ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ల సరసన కథానాయికగా నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. భారతదేశంలో నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిలతో కలిసి నటించిన ఏకైక కథానాయికగా ఆమె అరుదైన రికార్డును నెలకొల్పారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి.. పద్మశ్రీ పురస్కారం

1975 తర్వాత కథానాయిక పాత్రల నుండి హుందాగా సహాయ నటి పాత్రల్లోకి మారిన ఆమె, ‘సంసారం ఒక చదరంగం’ చిత్రంలో చిలకమ్మ పాత్రలో జీవించి నంది అవార్డును అందుకున్నారు. ‘రోజులు మారాయి’, ‘మంచి మనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘గీతాంజలి’, ‘తాయారమ్మ బంగారమ్మ’ వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో నటించిన ఆమె, 2023లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో చివరిసారిగా అలరించారు. ఆమె సేవా రంగానికి, కళారంగానికి చేసిన సేవలకుగాను అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందగా, 2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. నటిగానే కాకుండా ఉత్తమ వ్యాఖ్యాతగా, రెస్టారెంట్ వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందిన ఈ మహానటి మృతికి చిత్రపరిశ్రమ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.