Sharwanand: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హోదాను ఇప్పటి వరకూ అనుభవిస్తున్న శర్వానంద్ తన తోటి సోదరులకు బై బై చెబుతూ, ఈ యేడాది జనవరి నెలాఖరులో వివాహ నిశ్చితార్థం జరిపేసుకున్నాడు. హైకోర్ట్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం సన్నిహిత మిత్రులు, బంధువుల సమక్షంలో జరిగింది. రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితారెడ్డిని శర్వానంద్ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే… ఎంగేజ్ మెంట్ జరిగి నాలుగు నెలలు అయినా… వివాహానికి సంబంధించిన అప్ డేట్స్ రాకపోవడంతో సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థం రద్దు అయ్యిందని, పెళ్ళి జరగకపోవచ్చునంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి. వాటికి చెక్ పెడుతూ శర్వానంద్ తాజాగా తన వెడ్డింట్ డేట్ ను ప్రకటించాడు. జూన్ 2న మెహందీ ఫంక్షన్ జరుగుతుందని, ఆ మర్నాడే అంటే 3వ తేదీ పెళ్ళి కొడుకుని చేసి, అదే రోజు రాత్రి 11 గంటలకు వివాహ వేడుకను జరుపుతారని తెలిపాడు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.