రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ వండర్ ‘ఆదిపురుష్’ 3డీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఈ ఉదయం తెలిపింది. అనేకానేక తేదీలు మార్చుకుని ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు ఫిక్స్ కావడం వెనుక దర్శకుడు ఓంరౌత్ కు సంబంధించిన సెంటిమెంట్ ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓంరౌత్ ఇంతవరకూ కేవలం రెండే సినిమాలను డైరెక్ట్ చేశాడు. ‘ఆదిపురుష్’ అతనికి దర్శకుడిగా మూడో చిత్రం. మొదటగా స్వాతంత్ర సమరయోథుడు లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ జీవిత గాథను ‘లోకమాన్య’ పేరుతో మరాఠీలో ఓంరౌత్ రూపొందించాడు. ఈ సినిమా 2015 జనవరి 2వ తేదీ విడుదలై అతనికి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఓంరౌత్ రూపొందించిన రెండో సినిమా ‘తానాజీ’. అజయ్ దేవ్ గన్ తానాజీగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. ఈ సినిమా 2020 జనవరి 10వ తేదీ విడుదలైంది. ఈ సినిమాతో ఓంరౌత్ దేశవ్యాప్తంగా మంచి ఖ్యాతి గడించాడు. ఆ తర్వాతే అతను ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ త్రీడీ చిత్రం మొదలు పెట్టాడు. ఈ చిత్ర నిర్మాణం కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. మొత్తానికి షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పని యూనిట్ మొదలు పెట్టింది. ఈ ఏడాది ఆగస్ట్ లో 11న సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ అదే రోజున ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కాబోతుండటంతో ‘ఆదిపురుష్’ విడుదలను వాయిదా వేసుకున్నారు. అయితే ఒకటో రెండో వారాల తర్వాత ఈ సినిమా వస్తుందని ప్రభాస్ అభిమానులంతా అనుకున్నారు. కానీ ఏకంగా ఐదు నెలల వెనక్కి ఓంరౌత్ దీనిని తీసుకెళ్ళి పోయారు. సంక్రాంతి సీజన్ చిత్రసీమకు కలిసొచ్చేది కావడంతో పాటు ఓంరౌత్ తెరకెక్కించిన మొదటి రెండు సినిమాలు కూడా జనవరి ప్రథమార్థంలో విడుదల కావడంతోనూ సెంటిమెంట్ గా భావించి ఆ డేట్ ను చిత్ర యూనిట్ లాక్ చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.