ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందీ అంటే అది ‘సేవ్ ది టైగర్స్’ మాత్రమే. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, మరింత డబుల్ డోస్ ఫన్‌తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ రాబోతోంది. తాజాగా ఈ క్రేజీ సిరీస్‌కు సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ ప్రముఖ క్రియేటర్స్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సరికొత్త సీజన్ జియో హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా విడుదలైన సీజన్ 3 పోస్టర్ చూస్తుంటే ఈసారి దర్శకుడు శ్రీరామ్ ఎరగం కథను సరికొత్త పంథాలో నడిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సీజన్‌లో ఒక ఆసక్తికరమైన ‘కాస్మిక్ ట్విస్ట్’ ఉండబోతోంది. రెండు వైవిధ్యమైన ప్రపంచాల మధ్య జరిగే ఒక ప్రత్యేకమైన సోషల్ ఎక్స్‌పెరిమెంట్‌లా ఈ కథ సాగనుంది.
రోజూ భార్యల చేతిలో చిరాకులు పడే ముగ్గురు భర్తల జీవితాల్లోకి ఈ కాస్మిక్ ఎలిమెంట్ ఎలాంటి ఊహించని మలుపులు తీసుకురాబోతోంది? అనే పాయింట్ సిరీస్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది. రిలేషన్‌షిప్ సమస్యలను నవ్వుల ఫార్మాట్‌లో చూపిస్తూనే, సమాజంపై ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా ఈ సీజన్‌ను డిజైన్ చేశారు. మొదటి రెండు సీజన్లలో తమ అద్భుతమైన టైమింగ్‌తో పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన పాత జంటలు ఈసారి కూడా అలరించబోతున్నారు. ప్రియదర్శి – జోర్దార్ సుజాత, అభినవ్ గోమటం – పావని గంగిరెడ్డి, కృష్ణ చైతన్య – దేవియాని శర్మల కెమిస్ట్రీ ఈ సీజన్‌కు కూడా మెయిన్ పిల్లర్ కానుంది. అయితే, సీజన్ 3లో అన్నిటికంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే.. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఈ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వెన్నెల కిషోర్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
