మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక పాన్ ఇండియా మూవీగా జూన్ 3 న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. దేశ చరిత్రలో అమరుడిగా నిలిచిపోయిన సందీప్ ప్రాణ త్యాగానికి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తున్నారు. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీదకు రాకముందు జరిగిన కొన్ని విషయాలను చిత్ర నిర్మాతలు అనురాగ్, శరత్ ఒక ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నారు.
“ఈ చిత్రం సందీప్ జీవిత కథ ఆధారంగా తెరక్కిస్తున్నామని సందీప్ తల్లిదండ్రులకు చచెప్పినప్పుడు వారు సంతోషంగా ఒప్పుకున్నారు. బయోపిక్ గురించి మాట్లాడినప్పుడే సందీప్ పేరెంట్స్ తో రాయల్టీ గురించి మాట్లాడాం.. ప్రతి ఒక్కరి బయోపిక్ తీసినప్పుడు రాయల్టీ ఇవ్వాలి.. అలాగే మేజర్ సందీప్ తల్లిదండ్రులకు కూడా రాయల్టీ ఇద్దామని అడుగగా.. సందీప్ తండ్రి మాపై సీరియస్ అయ్యారు. గెటౌట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ ఆయన ఫైర్ అయ్యేసరికి భయపడ్డాం. నా కొడుకు జీవితాన్ని వెలకట్టే దీనస్థితిలో తాము లేమని చెప్పారు. వారు ఎంతో నిజాయితీ పరులు.. సందీప్ చనిపోయాక వచ్చిన ఎల్‌ఐసీ డబ్బులను కూడా వారు తీసుకోలేదు.. బంధువులకు పంచేశారు. అందుకే వారికి ఒకటే విషయం చెప్పాం. ఆ రాయల్టీ డబ్బులను సందీప్ లా ఎవరైనా సైన్యం లో చేరాలనుకొనేవారికి సందీప్ ఫౌండేషన్ ద్వారా చేయూత అందించడానికి వాడతామని తెలిపాం.. ఎందుకంటే దానికన్నా గొప్ప రాయల్టీ మేము వారికి ఇవ్వలేము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.