Sampoornesh Babu Exclusive Interview about Martin Luther King Movie:వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ సినిమాలో ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మంగళవారం నాడు విలేకర్లతో ముచ్చటించిన సంపూర్ణేష్ బాబు సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ రీమేక్ చేయడానికి కారణం ఏంటి? తెలుగుకి తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేశారు?
సంపూర్ణేష్ బాబు: తెలుగు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు, మహా సినిమా చేద్దామని పిలిచి, మండేలా మూవీ చూపించారు. నాకు తమిళ్ అంతగా అర్థం కాదు అంటే, పర్లేదు ఆ పాత్రను అర్థం చేసుకోండి చాలు, ఇప్పటిదాకా మీరు చేసిన భారీ డైలాగ్ లు లాంటివి వద్దు, మాకు కొత్తగా కావాలని చెప్పారు. నా నుంచి కొత్తగా ఏదో ఆశిస్తున్నారని అర్థమై, సరే చేద్దామని చెప్పాను.
ఇప్పటిదాకా సంపూ చేసిన పాత్రలు, సినిమాలు వేరు. ఆ ఇమేజ్ కి భిన్నంగా ఈ పాత్ర చేయించడం ఛాలెంజ్ అనిపించిందా?
సంపూర్ణేష్ బాబు: ‘’నేను హృదయ కాలేయం సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద ఉన్నది, నేను ఒక్కడేనా అనే ఫీలింగ్ కలిగింది, నరసింహాచారి అనే వ్యక్తి సంపూర్ణేష్ బాబు కావడం, హృదయ కాలేయం సినిమా రావడం అప్పటికి నన్ను నేను నమ్మలేకపోయాను’’, ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూస్తే కలిగింది, నేను ఎన్ని సినిమాలు చేసినా, పెద్ద పెద్ద డైలాగులు చెప్పినా, డ్యాన్స్ లు చేసినా డైరెక్టర్ వర్క్ షాప్ చేద్దామన్నారు. ఆమెకు ఇది మొదటి సినిమా కానీ నేను ఇప్పటికే సినిమాలు చేసి ఉన్నాను కదా వర్క్ షాప్ ఏంటి? సరే చూద్దాంలే అనుకున్నాను కానీ నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు డైరెక్టర్.
రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు ఒరిజినల్ నటుడి ప్రభావం ఎంతో కొంత పడుతుంది, మరి దానిని మీరు అధిగమించారు?
సంపూర్ణేష్ బాబు: నేను ఆ నటుడుని ఫాలో కాలేదు. మీరు నరసింహాచారిలా ఊరిలో ఎలా ఉంటారో అలా ఆఫీస్ కి రండి అని డైరెక్టర్ చెప్పారు, చెప్పులు కుట్టే సాధారణ వ్యక్తి ఎలా నడుస్తాడో అలాంటి నడక కావాలి ఆమె అన్నారు. నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను నిద్ర లేపింది ఈ పాత్ర, నేను ఆ పాత్ర అంత బాగా చేయడానికి కారణం డైరెక్టర్ పూజ.
ఈ సినిమా ప్రభావం మీ తదుపరి సినిమాలను ఎంచుకునే అంశంపై ఎలా ఉండబోతుంది?
సంపూర్ణేష్ బాబు: ఇప్పటికైతే దాని గురించి ఏం ఆలోచించడం లేదు. ఇదొక కొత్త సినిమా, ప్రయోగం చేశా, ముఖంగా నన్ను కొత్తగా చూపించారు, ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్లు వేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది, ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలామంది నీకు సరైన సినిమా పడిందని అంటున్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదరుచూస్తున్నా, ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగిందనిపించింది.
కామెడీ సినిమాలు చేయడం సులభంగా ఉందా? ఇలాంటి సినిమా చేయడం సులభంగా ఉందా?
సంపూర్ణేష్ బాబు: ఇది నా మొదటి సినిమా లాగా చేశా, కష్టమైనా, ఇష్టమైనా నటుడిగా అన్నీ చేయాలి. గత సినిమాలు నాకు కష్టం అనిపించలేదు, కానీ ఈ సినిమానే కష్టం అనిపించింది. ఈ పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా కొద్ది నెలలు పాటు ఓ సన్యాసిలా బ్రతకాలి, ఒక ఖాళీ బాటిల్ లా ఉండాలి ఆ బాటిల్లో పాలు పోస్తే పాల బాటిల్, నీళ్ళు పోస్తే నీళ్ళ బాటిల్, పెట్రోల్ పోస్తే పెట్రోల్ బాటిల్ అవ్వాలి, అలా ఉండటం కోసం చాలా వర్క్ చేశాను.