Samantha: స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఈ నెల 14న ఈ సినిమా ఐదు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. గత కొద్ది రోజులుగా ధూమ్ ధామ్ గా మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ చిత్ర బృందం మీడియా సమావేశాలకు హాజరవుతూ హల్చల్ చేస్తోంది. నిజానికి సమంత ఆ మధ్య అనారోగ్యం పాలై… ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ హెల్త్ ఇష్యూస్ కారణంగానే తన గత చిత్రం ‘యశోద’ ప్రమోషన్స్ లో ఆమె పాల్గొనలేదు. కేవలం ఒకటి రెండు ఇంటర్వ్యూలతో సరిపెట్టేసింది. అయితే ఇప్పుడు తిరిగి హెల్త్ నార్మల్ కండిషన్ కు రావడంతో… ‘శాకుంతలం’ ప్రమోషన్స్ కు బాగానే డేట్స్ కేటాయించింది. అయితే… సమంత ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తోంది.
విషయం ఏమంటే… గత వారం రోజులుగా సమంత ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ఇప్పుడు అనారోగ్యం పాలైంది. తనకు జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని సోషల్ మీడియా ద్వారా సమంత తెలిపింది. సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం చివరి నిమిషం వరకూ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఎంఎల్ఆర్ఐటీ వార్షికోత్సవంలో చిత్ర బృందం పాల్గొనవలసి ఉంది. కానీ తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని సమంత తెలిపింది. ‘గత వారం రోజులుగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మీ అందరి ప్రేమాభిమానాలలో మునిగి తేలాను. కానీ హెక్టిక్ షెడ్యూల్స్, ప్రమోషన్స్ వల్ల ఇబ్బందికి గురయ్యాను. ప్రస్తుతం జ్వరంతోనూ, గొంతునొప్పితోనూ బాధపడుతున్నాను’ అని సమంత తన అశక్తతను వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే… ఇప్పటికే హైదరాబాద్ లో ‘శాకుంతలం’ మూవీ స్పెషల్ ప్రీమియర్ షో ను వేశారు. ప్రసాద్ ఐమాక్స్ లో త్రీడీ వర్షన్ ను ప్రదర్శించారు. అయితే… దీనికి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఒకటి రెండు చోట్ల వేయాలనుకున్న స్పెషల్ ప్రీమియర్ షోస్ ను ‘దిల్’ రాజు కాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా… సమంతను గుణశేఖర్ శకుంతలగా ఎలా తెర మీద ప్రజంట్ చేశారో చూడాలనే ఆసక్తి అయితే చాలా మందిలో నెలకొని ఉంది. మరి ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
https://twitter.com/Samanthaprabhu2/status/1646075728449146882