సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుసపెట్టి అన్ని సినిమాలను లైన్లో పెట్టిన ఏ ముద్దుగుమ్మ నటించిన తమిళ్ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెల్సిందే. విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయన్ తార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి.
ఇక ఈ చిత్రం తెలుగులో “కెఆర్ కె” పేరుతో రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే తమిళనాట ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ షురూ చేశారు. తాజగా ఈ ప్రమోషన్స్ లో సామ్ కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ థాయ్ ల్యాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేసున్న విషయం విదితమే. ఇక నేడు వెకేషన్ ముగించుకొని ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది. అయితే మరోపక్క ఈ బ్యూటీ కాశ్మీర్ పయనమవుతుందని మరికొందరు అంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రంలో సామ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా షెడ్యూల్ కోసం అమ్మడు కాశ్మీర్ వెళ్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఏది అని తెలియాల్సి ఉంది.