అక్కినేని నాగచైతన్య నుండి విడివడిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి, చకచకా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీయార్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్న సమంత ఇప్పుడు తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ ను చేస్తోంది. ‘ఖైదీ’ మూవీని నిర్మించిన ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు సమంత నాయికగా ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నారు. చంద్రబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో సమంత పక్కన హీరోగా ఎవరు నటిస్తారనేది కొద్ది రోజుల్లో తెలియనుంది. ఇది భిన్నమైన, సరికొత్త ప్రేమకథా చిత్రం అని మాత్రమే దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే… సమంత తెలుగులోనూ ఓ కొత్త సినిమాకు పచ్చజెండా ఊపింది. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, హరి, హరీష్ అనే జంట దర్శకులతో ఓ సినిమా నిర్మించబోతున్నారు. అందులో సమంత హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలు కానుంది. దసరా సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మొత్తానికి సమంత నటిగా తానేమిటో మరోసారి నిరూపించుకునే పనిలో పడింది.