ప్రఖ్యాత గీత రచయిత, స్వర్గీయ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి వి. బి. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ & టీవీ డైరెక్టరీని విష్ణు బొప్పన అంకితమిచ్చారు. ఈ సమాచార దర్శిని ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో జరిగింది. ఈ వేడుకలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనయుడు, వర్ధమాన సంగీత దర్శకుడు యోగేశ్వర శర్మ, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ప్రముఖ నటుడు-దర్శకుడు – తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, ప్రముఖ నటీనటులు దివ్యవాణి, కృష్ణుడు, మాదాల రవి, కరాటే కళ్యాణి, కోట శంకరరావు, గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ఈస్టర్, టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల, ఎ.వి.గ్రూప్ అధినేత జి. ఎల్.విజయకుమార్, విజన్ వివికె అధినేత వి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొని విష్ణు బొప్పన కార్యదక్షతను కొనియాడారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న నిర్వహించనున్న వి. బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ కర్టెన్ రైజర్ ను ఆవిష్కరించారు. డైరెక్టరీ ఆవిష్కరణకు ముందు పలువురు గాయనీగాయకులు సీతారామ శాస్త్రి రాసిన పలు గీతాలను ఆలపించారు.