అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. నా జీవితంలో నేను రాసిన ఏకైక లవ్ లెటర్ అదే. అయితే, మా తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసిపోయింది. దాంతో వాళ్లు నాకు బడితపూజ (బాగా కొట్టారు) చేశారు’’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోన్న విరాటపర్వం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆ ఓటీటీ సంస్థ మై విలేజ్ షో ఫేం గంగవ్వతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సినిమాలో హీరోకి లవ్ లెటర్ రాశావు కదా, మరి రియల్ లైఫ్‌లో ఎవరికైనా ప్రేమలేఖ రాశావా అని గంగవ్వ ప్రశ్నిస్తే.. అందుకు బదులుగా పై విధంగా సమాధానం ఇచ్చింది. ఈ లెక్కన.. సాయి పల్లవి జీవితంలోనూ ఒక ప్రేమకథ ఉందన్న విషయం ఎట్టకేలకు బహిర్గతం అయ్యిందన్నమాట! చిన్నతనంలో సరే, మరి ఇప్పటి సంగతేంటి? ఇప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉందా? లేక సింగిలేనా? ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు కాబట్టి, సింగిలే అనుకోవాలి మరి!