సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం చిత్ర దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ, ”మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయినుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను. దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. ఈ సినిమా విషయానికి వస్తే, పాండమిక్ టైమ్ లో ఒంటరితనం ఫీల్ అయిన సిట్యుయేషన్ లో ఈ కథను రాసుకున్నాను. ఎనిమిది నెలలు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి, డైలాగ్స్ వర్షన్ పూర్తి చేశాను. ఈ కథను నంద్యాలకు చెందిన ఎల్లాలు బాబు గారికి చెప్పడం జరిగింది. ఆయనకు కథ నచ్చడం చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిపోయింది” అని అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ”ఈ దసరా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఉదయం నా కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ కు నేను వెళ్లి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే, నేను కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తను వచ్చి కెమెరా స్విచ్చాన్ చేయడం జరిగింది. నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి టెక్నీషియన్స్, మంచి క్యాస్టింగ్ కూడా సెట్ అయ్యింది. నేషనల్ అవార్డు కూడా వచ్చేటటు వంటి మంచి స్క్రిప్టు ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి” అని చెప్పారు.