మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజుతో సాయి తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్ మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై ఏడేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా తేజ్ తన ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా స్పెషల్ ట్వీట్ చేశాడు. తాను నటించిన విజయవంతమైన చిత్రాల ప్రత్యేక వీడియో క్లిప్‌ను పంచుకున్న తేజ్ “7 సంవత్సరాల క్రితం ఈ రోజున అన్నింటికీ మించి నటుడిగా ఉండాలనే నా అభిరుచి నిజమైంది. నా మొదటి సినిమా నుండి మీరు నన్ను హృదయపూర్వకంగా అంగీకరించారు. నా ఒడిదుడుకులలో నాతో ఉన్నారు. మీ అమూల్యమైన ప్రేమ & మద్దతు మరియు ఈ ప్రయాణాన్ని అందంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read also : మరోసారి చిక్కుల్లో శిల్పా, రాజ్ కుంద్రా… కేసు నమోదు
ఈ ఏడేళ్లలో తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ వంటి హిట్ చిత్రాలలో నటించారు. ఆయన చివరిగా ‘రిపబ్లిక్’ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో తేజ్ నటనపై ప్రశంసలు కురిశాయి. కాగా కొన్ని నెలల క్రితం తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి కొన్ని వారాల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తేజ్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే తేజ్, దర్శకుడు మారుతీ కాంబోలో ఓ సినిమా రానుంది.
ఇక మెగా అభిమానులు తేజ్ విజయవంతంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏడేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో తమ అభిమాన హీరో మరిన్ని విజయవంతమైన చిత్రాలలో నటించాలని ఆకాంక్షిస్తున్నారు.