దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీని బేస్ చేసుకొని చాలా సినిమాలు విడుదల తేదీని ప్రకటించడం ఆలస్యం చేస్తున్నాయి. ఒకవేళ జక్కన్న దసరాకు ఆర్ఆర్ఆర్ విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ఓ సమావేశం పెట్టి చెప్పాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ దసరా బరిలో నుంచి తప్పుకుంటే ఆచార్య, అఖండ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు విడుదల తేదీలను ప్లాన్ చేసుకొనే పనిలో ఉన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోవడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ‘మీకు మీరే.. మాకు మేమే..’ అనే ధోరణి మంచిది కాదనేది కొందరి వాదన.. ప్రస్తుతం జక్కన్న థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరోపక్క థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. త్వరలోనే ఆర్ఆర్ఆర్ బృందం మీడియా సమావేశం పెట్టి విడుదల తేదీపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.