మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఎన్నో ఏళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు మార్చి 25 న ఒక కానుకగా ఈ సినిమాను ఇచ్చేశాడు జక్కన్న.. ఇక ఈ సినిమా విడుదలై మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అక్కడ ఇక్కడ అని లేకుండా విదేశాల్లో కూడా దుమ్మురేపేసింది. అమెరికాలో అత్యధిక కాలం నడిచిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. ఇక మరో రికార్డును సొంతం చేసుకోవడానికి ఈ సినిమా సిద్దమవుతుంది. అమెరికాలో ఈ సినిమా రీ రిలీజ్ కానుంది..’ఆర్ఆర్ఆర్’ అన్ కట్ వెర్షన్ నేటి నుంచి అమెరికాలోని థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటివరకూ ఏ సినిమా కూడా ఇలాంటి అరుదైన అవకాశాన్ని పొందలేదు అంటే అతిశయోక్తి కాదు.
దాదాపు యూఎస్ఏ అంతటా 100 విభిన్న స్క్రీన్లలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో లెంత్ ఎక్కువ అవ్వడం వలన కట్ చేసిన సన్నివేశాలన్నీ ఈ అన్ కట్ వెర్షన్ లో ఉండనున్నాయి. అయితే ఈ అవకాశం కేవలం ఒకరోజు మాత్రమేనంట. ఇక అన్ కట్ వెర్షన్ కోసం అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటిటీలో కూడా తన సత్తా చాటుతున్న విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఈ మల్టీస్టారర్ మూవీ టాప్ 10లో కొనసాగుతోంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన విషయం విదితమే.. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.