RRR For Oscars In These Categories: అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను నేరుగా ఆస్కార్ నామినేషన్స్‌కు పంపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్‌ని కాదని గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ని ఆస్కార్స్‌కు భారతీయ అధికార ఎంట్రీగా ప్రకటించినప్పుడు.. దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ తీవ్ర నిరాశ చెందారు. చివరికి విదేశీయులు సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రబృందం స్వచ్ఛందంగా తమ చిత్రాన్ని నేరుగా ఆస్కార్స్‌కు పంపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. ఫర్ యువర్ కన్సిడరేషన్ (ఎఫ్‌వైసీ) క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.
ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ.. కొన్ని థియేటర్లలో ఆడిన చిత్రాలకు ఆస్కార్స్‌కు కన్సిడర్ చేయడానికి పంపమని పేర్కొంది. అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ మొదలైంది. మొత్తం 15 కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్‌ని కన్సిడర్ చేయాల్సిందిగా క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యింది. ఆ కేటగిరీలు.. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్ & రామ్ చరణ్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగణ్), ఉత్తమ సహాయ నటి (ఆలియా భట్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఒరిజినల్ స్కోర్), బెస్ట్ సౌండ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. మరి.. ఈ క్యాంపెయిన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘‘ప్రేక్షకుల ప్రేమతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు పడ్డ కష్ట, ప్రేమతో చేసిన పని.. మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ప్రపంచ నలమూలల నుంచి ఇంత ప్రేమని పొందడం నిజంగా ఒక డ్రీమ్‌లా ఉంది. డెస్టినీ ఎలా ఉంటుందో చూడాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇదే సమయంలో ఓ హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ‘ఆర్ఆర్ఆర్’కి మద్దతుగా చాలా గమ్మత్తైన ట్వీట్ చేశాడు. ‘‘ఉత్తమ సినిమా నామినీల్లోని ఒక్కో వ్యక్తిని స్టేజ్ మీద ‘నాటు నాటు’ పాటకి డ్యాన్స్ చేయించి.. ఎవరైతే చివరి వరకు నిలబడతారో వాళ్లకు ఆస్కార్స్ ఇవ్వాలి’’ అని ట్వీటాడు. ఇందుకు ‘ఈ ఐడియా ఏదో బాగుందే’ అంటూ కార్తికేయ సరదాగా రిప్లై ఇచ్చాడు.