బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో ధూసుకుపోతుంది. ఇందులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామాలో రష్మిక తో పాటు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించగా, ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అయితే తాజాగా శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మూవీ టీం అంతా పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
ముందుగా రష్మిక మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో సరైన సమయంలో, సరిగ్గా ఎంచుకున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అని చెప్పాలి. ఈ కథ విన్న వెంటనే ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పటిదాకా చూడలేదు అనిపించింది. నాకు బాక్సాఫీస్ నంబర్లు, కలెక్షన్లు కంటే ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే కోరిక ఉంటుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అలాంటి హృదయానికి తాకే కథ. ఇందులో నేను ‘భూమా’ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రలో చాలా భావోద్వేగం, నిస్సహాయత, ప్రేమ కలిసిన ఒక జీవితాన్ని చూపించబోతున్నాం. ఈ కథ విన్నప్పుడు మన అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగే సంఘటనలు గుర్తొచ్చాయి’’ అని చెప్పింది. ఇక రష్మిక సినిమాపై ఉన్న నమ్మకాన్ని ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలి నేను కూడా ప్రస్తావించారు.. ‘‘ఆమె ఈ సినిమాపై అంతగా నమ్మకం పెట్టుకుంది కాబట్టి, సినిమా విడుదలయ్యాకే పారితోషికం తీసుకుంటానని చెప్పింది. రష్మిక నటన ఈ సినిమాలో హైలైట్ అవుతుంది’’ అని తెలిపారు.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, ‘‘నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు జరిగిన ఓ చిన్న సంఘటన ఈ కథకు పునాది. 13 ఏళ్లుగా ఈ కథ గురించి ఆలోచిస్తున్నాను. ఐదు సంవత్సరాల క్రితం స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. ఈ సినిమా రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ టచ్ చేస్తుంది. నిజ జీవితానికి దగ్గరగా, మనసును హత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘‘ మూవీ చూశాను. చివరి 30 నిమిషాలు మర్చిపోలేని ఎమోషనల్. ప్రేయసితో వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ రష్మిక యాక్టింగ్ చూశాం. కానీ ఈ సినిమాలో చూపించిన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి ప్రీరిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా తీసుకొస్తాం’’ అని తెలిపారు.