మరాఠిలో ఘన విజయం సాధించిన చిత్రం ‘నటసమ్రాట్’. నానా పటేకర్ టైటిల్ పాత్రధారిగా మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ పొందింది. సహజంగా రీమేక్స్ కు దూరంగా ఉండే కృష్ణవంశీ ‘నటసమ్రాట్’ను ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులో తీస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా డబ్బింగ్ ను ప్రారంభించినట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ‘బిగ్ బాస్’ ఫేమ్ అలీ రజాతో మొదలు పెట్టామని, ఇప్పుడు డబ్బింగ్ కూడా అతనితోనే స్టార్ట్ చేశామని అన్నారు. గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రితో పాటు పలువురు గీత రచయితలు పాటలు రాశారు. అందులో ఒకటైన లక్ష్మీ భూపాల్ మాటల పాటకు చిరంజీవి గాత్రం ఇవ్వడం విశేషం. ‘రంగమార్తాండ’ మూవీ రషెస్ చూసిన వారంత ‘కృష్ణవంశీ ఈజ్ బ్యాక్’ అంటూ కితాబిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో తెలుగువారిని మెప్పిస్తుందో చూడాలి.