Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన ‘సంజూ’లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు. దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై వర్క్ జరుగుతోందనీ రణబీర్ చెప్పాడు. అనురాగ్ బసు ఈ సినిమా రచన చేస్తున్నట్టు రణబీర్ తెలిపాడు. అయితే కిశోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్ తాము కిశోర్ పై ఓ బయోపిక్ రూపొందిస్తున్న మాట వాస్తవమే కానీ, అందులో రణబీర్ కానీ, అనురాగ్ బసు కానీ పనిచేయడం లేదని తెలిపారు. తాము సొంతగా కిశోర్ బయోపిక్ రూపొందిస్తున్నట్టు అమిత్ చెప్పారు.
Read Also: Akshay Kumar: అక్షయ్ కుమార్ అమెరికా షో క్యాన్సిల్!?
మరి కిశోర్ బయోపిక్ లో రణబీర్ ఉన్నాడా? లేదా? అన్నది ఆసక్తి కలిగిస్తూ ఉంటే, మరోవైపు రణబీర్ తాను సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. అసలు లివింగ్ లెజెండ్ సౌరవ్ గంగూలీ వంటి క్రీడాకారుని జీవితాన్ని తెరకెక్కించడానికి, అందులో ఆయన పాత్ర పోషించడానికి గట్స్ కావాలనీ రణబీర్ చెప్పాడు. ఇటీవల రణబీర్, సౌరవ్ గంగూలీ కలసి కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ ఆడిన పిక్స్ చూస్తే, సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కడం ఖాయమని తెలుస్తోంది. అందులో రణబీర్ నటించడమూ ఖాయమేననీ అంటున్నారు. ఔనంటే కాదనిలే… కాదంటే అవుననిలే… ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు. కానీ, ఇక్కడ మాట్లాడుతోంది ఆడవారు కారు. కిశోర్ సొంత కొడుకు అమిత్ కుమార్, అలాగే సౌరవ్ తో అదే పనిగా క్రికెట్ ఆడిన రణబీర్ కపూర్. మరి వీరెందుకని విరుద్ధమైన స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు? లోగుట్టు తేలేదెప్పుడో?
