Ramayana : ‘రామాయణ’ లీక్‌పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!**

Ramayana Bookmyshow Record

Ramayana Bookmyshow Record

భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తున్న విజువల్ వండర్ ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 500 కోట్ల మార్కును దాటేసి, ఫుల్ రన్‌లో రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇంతటి ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్న చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకుపోతున్న ఈ సినిమా పూర్తి హెచ్‌డీ (HD) ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. కొందరు కేటుగాళ్లు థియేటర్లలో రహస్యంగా సినిమాను రికార్డ్ చేసి, సోషల్ మీడియాలోనూ, పైరసీ వెబ్‌సైట్లలోనూ వదిలేశారు. వందల కోట్ల బడ్జెట్‌తో, ఎంతో మంది కష్టంతో రూపొందిన ఈ దృశ్యకావ్యం ఇలా అడ్డగోలుగా నెట్‌లోకి రావడంతో మేకర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు ‘రామాయణ’ నిర్మాణ సంస్థ ఏమాత్రం తగ్గకుండా కఠిన చర్యలకు దిగింది. ఈ మేరకు ప్రేక్షకులకు, నెటిజన్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Intellectual Property Rights కింద ముంబై హైకోర్టు నవంబర్ 2, నవంబర్ 6 తేదీల్లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ‘రామాయణ’ సినిమాను గానీ, అందులోని చిన్న వీడియో క్లిప్‌ను గానీ అనుమతి లేకుండా రికార్డ్ చేయడం, అప్‌లోడ్ చేయడం, లేదా ఇతరులకు షేర్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. సరదా కోసం సోషల్ మీడియాలో సినిమా క్లిప్స్ షేర్ చేసే వారిపై కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, మరియు ఐటీ చట్టం 2000 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఈ చట్టాల ప్రకారం నిందితులకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. “థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయకండి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన పైరసీ వీడియోలను తక్షణమే డిలీట్ చేయండి” అని చిత్ర యూనిట్ ప్రజలను కోరింది. ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సివిల్, క్రిమినల్ మరియు కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ప్లాట్‌ ఫామ్స్ సహాయంతో ఐపి అడ్రస్‌లను ట్రేస్ చేసి, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.