ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే హీరో రామ్ పోతినేని.. ఇటీవల నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కు అతను అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.
Also Read : Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..!
రామ్ మాట్లాడుతూ.. ‘ అమ్మవాలది హైదరాబాద్ కావడటం వలన నేను అక్కడ పుట్టాను. తర్వాత మా కుటుంబం విజయవాడకు వెళ్లింది. 1988లో విజయవాడలో జరిగిన కుల ఘర్షణల్లో మా కుటుంబం అప్పటి వరకు సంపాదించిందంతా ఒక్క రాత్రిలో కోల్పోయాము. ఆ పరిస్థితుల కారణంగా మేము చెన్నై వెళ్లిపోయాం. మా నాన్న మళ్లీ మొదటి నుంచి స్థాపన ప్రారంభించారు. కింద నుంచి కష్టపడి పైకి రావడం వేరు, అంత కష్టపడి ఉన్న స్థాయిని కోల్పోయి మళ్లీ ప్రారంభించడం వేరు. మా నాన్న ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన అంటే చాలా గౌరవం. ఎంత కోల్పోయామనే దానికి ఉదాహరణ కూడా చెప్పాలంటే.. విజయవాడలో నా బొమ్మల కోసం ఒక పెద్ద గది ఉండేది. మేం చెన్నైకు మారినప్పుడు మా ఇల్లు మొత్తం కలిపినా నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి మారడం నిజంగా కష్టం. అయినా మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచారు” అని వివరించారు.
అలాగే తన వ్యక్తిగత అభిరుచుల గురించి కూడా చెప్పారు. “నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికినపుడు ఫోన్ కూడా ఆపేసి ట్రిప్‌లకు వెళ్తాను. వివిధ ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడు మన విలువను అర్థం అవుతుంది. స్టూడెంట్ అని చెప్పి వారితో మాట్లాడుతుంటాను. నా ‘దేవదాసు’ సినిమా విడుదల తర్వాత చిరంజీవి ఒక సలహా ఇచ్చారు.. ‘ప్రతి సినిమా నీకు మొదటిదే, అలాగే కష్టపడాలి’. ఆయన ‘దేవదాసు’ చూసినప్పుడు నన్ను రామ్‌చరణ్ తో పరిచయం చేశారు. ఆ సమయంలో, సినీ నేపథ్యం ఉంటే బాగుండేది అని అనుకున్నా, కానీ తరువాత తెలిసింది, సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే చాలా ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది” అని రామ్ వివరించారు.