ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు పాకి తెలుగు సత్తా చూపిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ ఉత్తరాదిన విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ దెబ్బతో బన్నీ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం జనవరి 26 న హిందీలో రిలీజ్ అవుతున్న విషయం విదితమే. అయితే దీంతో పాటు మరో తెలుగు సినిమా హిందీలో తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది.
సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ‘రంగస్థలం’ కూడా హిందీలో విడుదల కానుంది. ఈ విషయాన్నీ స్వయంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షాహా తెలిపారు. జనవరి 26 న ‘అల వైకుంఠపురంలో’ రిలీజ్ చేస్తామని, ఫిబ్రవరిలో ‘రంగస్థలం’ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలను ఇష్టపడుతున్నారని, దాని వలన తమకు కూడా లాభాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో రంగస్థలం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ నటించిన ‘మెర్సల్’, అజిత్ నటించిన ‘విశ్వాసం’ కూడా హిందీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏదిఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ అంచలంచెలుగా ఎదగడం గర్వించదగ్గ విషయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
