rajinikanth is highest tax payer in tamilnadu: ప్రముఖ తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాషాగా, ముత్తుగా, అరుణాచలంగా, నరసింహగా, శివాజీగా, రోబోగా .. ఎన్నో రకాలుగా అలరించిన రజనీకాంత్ అంటే తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. అవార్డులు, రివార్డులు ఆయనకేం కొత్త కాదు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా ఆయనకు ఓ అవార్డును ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లింపుదారుగా నిలవడంతో ఇంకమ్ ట్యాక్స్ అధికారులు రజనీకాంత్‌ను అవార్డుతో సత్కరించారు. జూలై 24న చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకమ్ ట్యాక్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారిలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వారికి ఐటి అధికారులు అవార్డులు అందించారు. రజనీకాంత్ తరఫున ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ అవార్డు అందుకున్నారు.
దక్షిణాదిలో రజనీకాంత్ అత్యధిక పారితోషికం తీసుకుంటారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత డబ్బు సంపాదించినా ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరంగానే ఉంటారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ఇటీవల తనకు పేరు, ప్రతిష్టలు ఉన్నా జీవితంలో ప్రశాంతత లేదని రజనీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జైలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో శివ రాజ్‌కుమార్, ఐశ్వర్యరాయ్, శివ కార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, రమ్యకృష్ణ నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.