Site icon NTV Telugu

మోడీకి కృతజ్ఞతలు… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై రజినీకాంత్ స్పందన

Annaatthe first look poster on Vinayaka Chaturthi?

నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను విడుదల చేశారు. తనకు ఈ అవార్డును ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నటనా ప్రతిభను కనిపెట్టిన తన స్నేహితుడు, బస్సు డ్రైవర్ రాజ్ బహదూర్‌కు, తనను నటుడిగా మార్చడానికి కష్టపడిన తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు రజినీ. అలాగే రజనీకాంత్ తన గురువు కె బాలచందర్, తన సినిమాలకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులందరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Read also : “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం

రజనీకాంత్ ఈరోజు అక్టోబర్ 24న చెన్నైలోని పోయెస్ గార్డెన్ హౌస్ దగ్గర మీడియాతో సమావేశమై ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడం గురించి మాట్లాడారు. తలైవా తానెప్పుడూ ఈ గౌరవనీయమైన అవార్డును గెలుచుకుంటానని ఊహించలేదని చెప్పారు. ఇలాంటి సమయంలో తన గురువు కె బాలచందర్ సజీవంగా లేరని, ఆయన లేకుండా అవార్డు అందుకోవడం బాధగా ఉందని అన్నారు.

ఏప్రిల్ 2021లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు గత నాలుగు దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన కృషికి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసినట్లు ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రకటన చేయగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అవార్డు వేడుక ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ అవార్డు వేడుక రేపు (అక్టోబర్ 25) ఢిల్లీలో జరుగుతుంది. రజినీకాంత్ స్వయంగా ఈ వేడుకకు హాజరై అవార్డును అందుకుంటారు.

రజనీకాంత్ 1975లో దివంగత దర్శకుడు కె. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సౌత్ తో పాటు రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానున్న ‘అన్నాత్తే’లో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కానుంది.

Exit mobile version