దక్షిణ భారత సినీ పరిశ్రమలో రజనీకాంత్‌తో సినిమా చేయడం అనేది చాలా మంది దర్శకుల కల. అయితే, ఇంతటి స్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సరైన దర్శకుడిని ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడటం ఆశ్చర్యకరం. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ తన స్నేహితుడు కమల్ హాసన్ నిర్మాణంలో మరో భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరు లెజెండరీ నటులు కలిసి పనిచేస్తున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.
అయితే రజినీకాంత్ కెరీర్ లో 173వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ సినిమాని సీనియర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కించనున్నారని ముందు కన్ఫర్మ్ చేశారు. కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఫలితంగా, చిత్ర బృందం మళ్ళీ ‘డైరెక్టర్ హంట్’ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్–కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్‌కు తగిన స్థాయి, విజన్ ఉన్న దర్శకుడిని తమిళంలో కనుగొనడం టీమ్‌కు సవాలుగా మారింది. స్టార్ ఇమేజ్-కంటెంట్ బ్యాలెన్స్ చేయగల దర్శకుడు దొరకకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే గందరగోళంలో పడింది.
కాగా తమిళ పరిశ్రమ తో పాటు, రజనీ–కమల్ టీమ్ ఇప్పుడు టాలీవుడ్ వైపు కూడా దృష్టి సారించినట్లు సమాచారం. తెలుగు దర్శకులు ఇటీవలి కాలంలో తమిళ స్టార్‌లతో మంచి విజయాలు సాధిస్తున్నారు. ఈ సక్సెస్‌లతో తెలుగు దర్శకుల ప్రతిభను తమిళ పరిశ్రమ కూడా గుర్తిస్తోంది. ముఖ్యంగా, రజనీకాంత్ వంటి స్టార్‌తో పనిచేసే ఛాన్స్ వస్తే, ప్రస్తుతం బిజీగా ఉన్న అనేక తెలుగు దర్శకులు కూడా తమ ప్రాజెక్టులను పక్కన పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందులోను రజనీకాంత్–కమల్ కాంబినేషన్ అరుదు. కాబట్టి, ఈ భారీ ప్రాజెక్ట్‌ను చివరకు ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు? ఇదే ఇప్పుడు టాలీవుడ్-కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. త్వరలోనే ఫైనల్ డైరెక్టర్ పేరు వెలువడే అవకాశం ఉంది.