Rajesh Khanna Birth Anniversary: రాజేశ్ ఖన్నా సినిమా చూడాలని అప్పట్లో ఆబాలగోపాలం తపించేవారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు మహదానందం చెందేవారు జనం. ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా ఆయనను జనం కీర్తించారు. రాజేశ్ ఖన్నా 1942 డిసెంబర్ 29న అమృత్ సర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు జతిన్ ఖన్నా. స్కూల్ లో చదివే రోజుల్లోనే పలు నాటకాల్లో నటించారు ఖన్నా. ‘అంధ్ యుగ్’ అనే నాటకంలో రాజేశ్ ఖన్నా నటన చూసిన ఓ అతిథి, సినిమాల్లో ట్రై చేయమని సూచన ఇచ్చారు. దాంతో సినిమాల బాట పట్టారు ఖన్నా. ఆయన సమీప బంధువు జతిన్ పేరును కాస్తా రాజేశ్ గా మార్చారు. తరువాత ముంబై చేరి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫిలిమ్ ఫేర్ నిర్వహించిన పోటీలో రాజేశ్ ఖన్నా విజేతగా నిలిచారు. 1966లో ‘ఆఖ్రీ ఖత్’తో తొలిసారి రాజేశ్ ఖన్నా తెరపై వెలిగారు.
రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు నటులుగా తమ సత్తా చాటుకున్న తరువాతే స్టార్స్ గా ఎదిగారు. రాజేశ్ ఖన్నా అలా కాదు, ‘ఆఖ్రీ ఖత్’లో అలా పరిచయం అయ్యాడో లేదో రెండో సినిమా ‘రాజ్’ లోనే ద్విపాత్రాభినయంచేయడం, ఆ సినిమా విజయం సాధించడం, ఆ పై రాజేశ్ ఖన్నా కాల్ షీట్స్ కు డిమాండ్ పెరగడం జరిగిపోయాయి. అందుకనే రాజేశ్ ఖన్నాను హిందీ చిత్రసీమలో ‘ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అంటారు.
రాజేశ్ ఖన్నా తమ చిత్రాల్లో ఉంటే చాలు అని భావించిన నిర్మాతలు ఆయనకు బ్లాంక్ చెక్స్ ఆఫర్ చేసిన సందర్భాలూ లేకపోలేదు. రాజేశ్ ఖన్నా సినిమా వస్తోందంటే, ఆయనకంటే సీనియర్ హీరోలు సైతం ఆలోచించి మరీ తమ చిత్రాలను విడుదల చేసేవారు. వరుస విజయాలతో పలు గోల్డెన్ జూబ్లీస్, సిల్వర్ జూబ్లీస్ తన ఖాతాలో వేసుకున్నారు రాజేశ్ ఖన్నా. ఆయనతో కలసి అమితాబ్ బచ్చన్ “ఆనంద్, నమక్ హరామ్” వంటి సినిమాల్లో సైడ్ హీరోగా నటించారు. 1967 నుండి 1974 దాకా ఏడేళ్ళ పాటు రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా రాజ్యమేలారు. 1973లో ఏయన్నార్ హీరోగా వి.బి.రాజేంద్రప్రసాద్ తెరకెక్కించిన ‘బంగారుబాబు’లో రాజేశ్ ఖన్నా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. రాజేశ్ ఖన్నా నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ విజయం సాధించాయి. అదే తీరున తెలుగులో విజయం సాధించిన కొన్ని సినిమాలు రాజేశ్ ఖన్నా హీరోగా హిందీలో రీమేక్ అయి జయభేరీ మోగించాయి. 1975 తరువాత నుంచీ అనూహ్యంగా రాజేశ్ ను పరాజయాలు పలకరించడం మొదలు పెట్టాయి.
రాజేశ్ ఖన్నా రాజకీయాల్లోనూ రాణించారు. మన దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘ఆజ్ కా ఎమ్.ఎల్.ఏ రామ్ అవతార్’ లో ఎమ్మెల్యేగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తెలుగునాట యన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో ఆ విజయాన్ని పురస్కరించుకొని, రాజేశ్ ఖన్నా తన యూనిట్ సభ్యులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఏదో ఒక రోజున తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని అప్పట్లోనే భావించారు రాజేశ్ ఖన్నా. 1973లో డింపుల్ కపాడియాను పెళ్ళాడారు రాజేశ్. వారికి ఇద్దరు పిల్లలు. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా. కొద్దిరోజులకే రాజేశ్, డింపుల్ విడిపోయారు. అయితే విడాకులు తీసుకోలేదు. ఈ నాటి మేటి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా. 1992లో న్యూ ఢిల్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజేశ్ ఖన్నా గెలుపు సాధించారు. ఆ సమయంలో డింపుల్, ఆమె పిల్లలు కలసి రాజేశ్ కు ప్రచారం కూడా చేశారు. అపూర్వ విజయాలు, అద్భుతమైన ఆదరణ చవిచూసిన రాజేశ్ ఖన్నా రాజాలాగే తనువు చాలించారు. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా అభిమానులను శోకసముద్రంలో ముంచేస్తూ కన్నుమూశారు. మరణం తరువాత రాజేశ్ ఖన్నాకు 2013లో పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ నాటికీ భారతదేశంలోని ఏ సినిమా రంగంలోనైనా ‘సూపర్ స్టార్ డమ్’ గురించిన చర్చ చోటు చేసుకున్న ప్రతీసారి రాజేశ్ ఖన్నా పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది. అదీ రాజేశ్ ఖన్నా గ్రేట్ నెస్ అని చెప్పక తప్పదు.