దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు “ఆర్ఆర్ఆర్”పై కొమరం భీమ్ ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ట్రైలర్ లో ముస్లిం టోపీ ధరించడంపై వాళ్ళు మండిపడ్డారు. మరోవైపు అల్లూరి వారసులు కూడా ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నాశనం చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. అంతేనా విడుదలకు ముందు “ఆర్ఆర్ఆర్”పై తెలంగాణ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. కోర్టు ఆ పిల్ ను కొట్టేసిందనుకోండి అదే వేరే విషయం. ఇక జక్కన్న కూడా వాళ్లకు విడుదలయ్యాక సినిమానే సమాధానం చెప్తుంది అని అన్నారు. ఎన్టీఆర్ అలా టోపీ ధరించడానికి ఒక కారణం ఉంటుందని, అది సినిమా చూస్తే అర్థమవుతుందని అన్నారు.
Read Also : SonuSood : భార్యా బాధితుడి ట్వీట్… ట్రీట్మెంట్ కావాలంటూ సోనూకు రిక్వెస్ట్
“ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలయ్యాక అటు అల్లూరి ఫామిలీ నుంచి గానీ, ఇటు భీమ్ వారసుల నుంచి గానీ ఎలాంటి స్టేట్మెంట్స్ రాలేదు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా రాజమౌళి స్వయంగా భీమ్ స్వస్థలమైన ఆసిఫాబాద్ కు వెళ్లడం, అక్కడ భీం వారసులతో కలిసి సినిమా చూడడం చూస్తుంటే మొత్తానికి కొమరం భీమ్ ఫ్యామిలీ కూల్ అయినట్టే కన్పిస్తోంది. అక్కడ రాజమౌళి మొబైల్ థియేటర్‌లో “ఆర్‌ఆర్‌ఆర్”ని వీక్షించారు. ఆ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే… తక్కువ ఖర్చుతో నిర్మించిన ఎయిర్ బెలూన్ థియేటర్ ఇది. ఈ థియేటర్ నిర్మాణంలో మహిళలు పెద్ద పాత్ర పోషించారు. అంతేకాదు ఈ థియేటర్ కు కొమరం భీమ్ థియేటర్ అని పేరు పెట్టారు. కాగా ఆసిఫాబాద్ జిల్లా అధికారులు, కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు, అక్కడి ప్రజల నుంచి రాజమౌళికి ఘన స్వాగతం లభించింది. రాజమౌళి కొమరం భీమ్ విగ్రహం ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించిన తరువాత భీమ్ కుటుంబ సభ్యులతో కలిసి “ఆర్ఆర్ఆర్”ను వీక్షించారు.