టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ముందు వరుసలో ఉన్నాయి. రాబోయే సంక్రాంతి పండుగ సీజన్ లో రెండు సినిమాలూ క్లాష్ కాబోతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” జనవరి 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు ప్రభాస్, పూజా హెగ్డేల “రాధే శ్యామ్” చిత్రం జనవరి 14న బిగ్ స్క్రీన్‌ల పైకి రానుంది. దేశవ్యాప్తంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Read Also : సీనియర్ నటుడు కైకాలకు స్వల్ప అస్వస్థత
తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో టాప్ డైరెక్టర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్”, “రాధే శ్యామ్” మధ్య జరగబోతున్న క్లాష్ గురించి ఓపెన్ అయ్యారు. ఈ క్లాష్ వ్యాపారానికి ఎలాంటి ఆటంకం కలిగించదని రాజమౌళి అన్నారు. “నాలుగు సినిమాలు కలిసి వచ్చినా అవి బాగుంటే వాటన్నింటినీ చూడటానికి జనం వస్తారు. గతంలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. ‘రాధే శ్యామ్’ మాత్రమే కాదు మరిన్ని సినిమాలు రానున్నాయి. అన్ని సినిమాలు బాగుండాలని, అవన్నీ డబ్బు సంపాదిస్తాయనీ, ప్రేక్షకులకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించాలని నేను ఆశిస్తున్నాను. నా సినిమా బాగా ఆడాలి… మరో సినిమా ఆడకూడదు అని చెప్పే సమయం ఇది కాదు. మనమందరం కలిసి అన్ని సినిమాలు డబ్బు సంపాదించాలని కోరుకునే సమయం ఇది” అని రాజమౌళి అన్నారు.