Rajamouli:’ఆస్కార్ అవార్డ్స్’ అన్న పేరు వింటే చాలు సినీ ఫ్యాన్స్ మనసుల్లో ఆనందం పొంగిపొరలుతూ ఉంటుంది. ‘ఆస్కార్ అవార్డులు’ సాధించిన చిత్రాలనే కాదు, అకాడమీ నామినేషన్లు పొందిన సినిమాలనూ సినీజనం ఎంతగానో అభిమానిస్తారు, గౌరవిస్తారు. సదరు చిత్రాలను అంతకు ముందే థియేటర్లలో ఓ సారి చూసేసినా, మళ్ళీ చూడాలనీ తపిస్తారు. అంతటి క్రేజ్ బహుశా ప్రపంచంలో ఏ సినిమా అవార్డులకూ లేదనే చెప్పాలి. ఈ సారి ఆస్కార్ అవార్డుల నామినేషన్లను జనవరి 24న ప్రకటించనున్నారు. భారతీయ కాలమానం ప్రకారం జనవరి 25వ తేదీ తెల్లవారు జామున ఈ ప్రకటన సాగనుంది. ఇదిలా ఉంటే మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి నామినేషన్స్ పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మన భారతదేశంలోనూ ఈ సారి ‘ఆస్కార్ నామినేషన్స్’పై మరింత ఆసక్తి చోటు చేసుకుంది. అందుకు మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కారణమని చెప్పక తప్పదు. రాజమౌళి రూపొందించిన ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ఇప్పటికే కొన్ని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ తీరున ఆస్కార్ నామినేషన్లనూ సంపాదిస్తుందని సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ పత్రిక ఓ సర్వే నిర్వహించింది. అందులో ఎవరికి నామినేషన్స్ లభించవచ్చు అనే అంశంపై ఓటింగ్ సాగింది. ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఈ ఓటింగ్ లో మన రాజమౌళి ప్రథమస్థానంలో నిలిచారు.
ఆస్కార్ అవార్డుల్లో 24 విభాగాలు ఉన్నాయి. వాటిలో ఏ కేటగిరీలో నామినేషన్ సంపాదించినా, సినీజనం ఎంతో గర్విస్తూ ఉంటారు. అన్ని విభాగాలు ఉన్నప్పటికీ, ఆస్కార్ నామినేషన్స్ లో ‘బిగ్ ఫైవ్’గా పేరొందిన “బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్ ప్లే” పైనే అందరూ దృష్టి సారిస్తారు. అలాంటిది ఇప్పటి దాకా ఏ భారతీయ దర్శకునికీ సాధ్యం కాని ఫీట్ ను మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సాధించబోతున్నట్టు ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ సర్వేలో తేట తెల్లమవుతోంది. ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ సంపాదించే దర్శకులు ఎవరు? అన్న అంశంపై ఓటింగ్ సాగింది. ఇందులో ప్రపంచంలోని నలుమూలల ఉన్న నెటిజన్స్ పాల్గొన్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే ఈ సారి విఖ్యాత దర్శకులు స్టీవెన్ స్పీల్ బెర్గ్, జేమ్స్ కేమరాన్ కూడా బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్స్ కోసం పోటీ పడుతున్నారు. వారిని సైతం వెనక్కి నెట్టి ఎస్.ఎస్.రాజమౌళి పేరు ఓటింగ్ లో ముందు ఉండడమే ‘లాస్ ఏంజెలిస్ టైమ్స్’ సర్వే విశేషం!
ఈ సర్వేలో ‘ట్రిపుల్ ఆర్’ దర్శకునిగా రాజమౌళికి 18 శాతం ఓట్లు రాగా, ‘ద ఫ్యాబుల్మన్స్’ సినిమా డైరెక్టర్ గా స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు 16 శాతం ఓట్లు లభించాయి. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’ సినిమా దర్శకులు డాన్ క్వాన్, డేనియెల్ షూనెర్ట్ కు 13 శాతం ఓట్లు దక్కగా, ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ మూవీతో జేమ్స్ కేమరాన్ కు 12 శాతం ఓట్లు వచ్చాయి. తరువాతి స్థానాల్లో ‘ద బాన్సీష్ ఆఫ్ ఇనిషెరిన్’ డైరెక్టర్ మార్టిన్ మెక్ డోనా 9 శాతం ఓట్లు పోగేయగా, ‘టార్’ చిత్ర దర్శకుడు టాడ్ ఫీల్డ్ 7 శాతం ఓట్లు సంపాదించారు. ఓటింగ్ లో ఈ ఆరుగురు మంచి శాతాలు సాధించారు. కాబట్టి రేపు డైరెక్టర్ విభాగంలో నామినేషన్లు సంపాదించే దర్శకుల్లో తప్పకుండా వీరి పేర్లు ఉంటాయని అంటున్నారు. అలాగే మన రాజమౌళి పేరు కూడా చోటు చేసుకుంటుందని సినీఫ్యాన్స్ నొక్కివక్కాణిస్తున్నారు. మరి వారి మాట, ఈ సర్వే ఫలితాలు ఫలించి, రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ లభిస్తే అది ఖచ్చితంగా ఓ చరిత్ర అవుతుంది.