”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మూవీ మేకింగ్ విశేషాలు చెబుతూ, ”’కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా చూశాక సిద్ధును పిలిచి కథ ఉంటే చెప్పమన్నాను. అతను రొమాంటిక్ కామెడీస్ ఉన్నాయని అన్నాడు. కేవలం రోమ్ కామ్ వద్దు అని, ఇంకేదైనా కథ చూడు అన్నాను. అప్పుడు లవ్ స్టోరీకి క్రైమ్ యాంగిల్ కలిపి యూత్ ఫుల్ కథను చెప్పాడు. సిద్దు ఈ కథ చెబుతున్నంత సేపూ బాగా నవ్వుకున్నాను” అని అన్నారు. అయితే ఈ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెప్పాక ఆయన కొన్ని మార్పులు చేసి కొన్ని సలహాలు ఇచ్చారని ఆ రకంగా ‘డీజే టిల్లు’కు ఆయన ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పారు.
గత యేడాది తమ బ్యానర్ నుండి వచ్చిన ‘రంగ్ దే’, ‘వరుడు కావలెను’ చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, పాండమిక్ సిట్యుయేషన్ కు భయపడి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రాలేదని నాగవంశీ అన్నారు. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రిజల్డ్ పొందలేకపోయిన మాట వాస్తవమని, అయితే ‘డీజే టిల్లు’ విషయంలో తమకు ఓ కొత్త అనుభవం ఎదురైందని అన్నారు. సిద్ధూ ఆల్మోస్ట్ కొత్త హీరో అయినా హైదరాబాద్, విశాఖలో థియేటర్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయని చెప్పారు. ఈ సినిమా కంటెంట్ పై మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ”’డీజే టిల్లు’ యూత్ ఫుల్ సినిమా కానీ అడల్డ్ చిత్రం కాదు. ముద్దు సీన్స్ కూడా అడల్ట్ కిందకు వస్తాయనుకుంటే సరికాదు. ఇవాళ తెరకెక్కుతున్న కంటెంట్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అమ్మాయి కోణంలో సాగే చిత్రమిది. టిల్లు ఒక అమాయక పాత్ర మాత్రమే. అతన్ని హీరోయిన్ ఆడుకుంటుంది. దానిలోనుంచే వినోదం పుడుతుంది. ఈ మూవీ కోసం రామ్ మిరియాల కంపోజ్ చేసి పాడిన డిజె టిల్లు సాంగ్ కానీ, అలాగే అనిరుద్ పాడిన పటాసు పిల్ల పాట, సిద్దు పాడిన మరో పాట ఇలా అన్నీ దేనికవే బాగా ఆకట్టుకున్నాయి” అని అన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా తమకు ఉందని అందుకే ఆ రకంగా ఎండ్ చేశామని తెలిపారు.
అన్నీ అనుకూలిస్తే 25నే ‘భీమ్లా నాయక్’!
తాను గత ప్రెస్ మీట్ లో సీఎం జగన్ పేరు చెప్పినందుకు కొందరు మరోలా దానిని తీసుకున్నారని, అది కరెక్ట్ కాదని సూర్యదేవర నాగవంశీ వివరణ ఇచ్చారు. ‘భీమ్లా నాయక్’ పెద్ద సినిమా కాబట్టి నైట్ కర్ఫ్యూ వంటి పరిస్థితులు లేకుండా రోజుకు నాలుగు ఆటలు వేసేలా ఉన్నప్పుడే మూవీని విడుదల చేయాలన్నది తన ఆలోచన అని తెలిపారు. గురువారం ఎపీ సీఎంను చిరంజీవి గారితో పాటు ఇతర పెద్దలు వెళ్ళి కలిసిన తర్వాత సానుకూలంగా నిర్ణయాలు ఉంటాయనే నమ్మకం ఏర్పడిందని, అన్నీ బాగుంటే ‘భీమ్లా నాయక్’ను ఈ నెల 25న విడుదల చేస్తామని, మూవీ కంటెంట్ రెడీగా ఉందని నాగవంశీ చెప్పారు.