బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. యం. రాజశేఖర్ రెడ్డి, ‘తలైవి’ దర్శకుడు ఎ. ఎల్ విజయ్, ప్రకాశ్‌రాజ్, బి. నర్సింగరావు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ అండ్ కావ్య సమర్పణలో ప్రొడక్షన్ నం 6గా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం తొలి షెడ్యూల్ శివరాత్రి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తెలుగులోను, తమిళంలోను ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర ఇద్దరు ఫేమస్ కావటంతో వారివురు కామన్‌గా ఈ రెండు వర్షన్స్ లో నటించనున్నారు. తెలుగులో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం చేస్తున్న పాత్రను తమిళ్‌లో ‘అసురన్’ ఫేమ్, సింగర్ టి. జె. అరుణాచలం నటించటం విశేషం. వారివురితో పాటు నవీన్‌చంద్ర పాల్గొనే కీలకమైన ఛేజింగ్ సన్నివేశాలను హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్టు నిర్మాత యం.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
