‘బాహుబలి’తో ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా సూపర్ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారతీయ సినిమాలో అత్యధికంగా ఫాలో అవుతున్న సినీ ప్రముఖుల్లో వీరిద్దరూ ఉన్నారు. వారి రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. భవిష్యత్తులో రాజమౌళితో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ “రాధేశ్యామ్” మూవీ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు.
Read Also : KGF 2 : ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్… అప్పటిదాకా ఆగాల్సిందే !
“రాజమౌళి, నేను మంచి స్నేహితులం. మేము తరచుగా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాము. అనేక విషయాలు చర్చించుకుంటాము. భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ కోసం మళ్ళీ కలిసి పని చేస్తాము. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయనతో నేను సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటానని రాజమౌళికి తెలుసు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతోంది అనే విషయాన్ని నేను ఇప్పుడే చెప్పలేను. రాజమౌళి, నా దగ్గర ఒక చిన్న ప్లాన్ ఉంది. అది త్వరలోనే రూపుదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నాము” అంటూ యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే వంటి చిత్రాలతో బిజీగా ఉండగా, మరోవైపు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నాడు. మరి వీరిద్దరి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ తెరకెక్కడానికి చాలా కాలం పడుతుందన్నది వాస్తవం.