పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ది రాజాసాబ్’ . భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితంపై, పరాజయానికి గల కారణాలపై నిర్మాత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి.
‘ది రాజాసాబ్’ చిత్రాన్ని సరైన సీజన్‌లో విడుదల చేయకపోవడమే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడానికి ప్రధాన కారణమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అంగీకరీంచారు. సంక్రాంతి పోటీ నడుమ సరైన విండో, సీజన్‌ను ఎంచుకోవడంలో జరిగిన పొరపాటే సినిమా ఫలితాన్ని దెబ్బతీసిందని, మేకర్స్ ప్లానింగ్ లోపమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. ‘ది రాజాసాబ్’ ఫలితంతో సంబంధం లేకుండా, రెబల్ స్టార్ ప్రభాస్‌తో తమ బ్యానర్‌లో మళ్లీ ఖచ్చితంగా సినిమా ఉంటుందని తెలిపారు. 2028లో ప్రభాస్ గారితో డెఫినెట్‌గా మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాం అని ప్రకటించారు.

