Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి

Posani Krishna

Posani Krishna

Posani Krishna Murali: టాలీవుడ్‌లో రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న పోసాని కృష్ణమురళి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఒకేసారి 18 నుంచి 22 సినిమాలకు రచయితగా పని చేశానని పోసాని తెలిపారు. “ఆ సమయంలో ఇండియాలో అంత బిజీగా ఉన్న రైటర్ మరొకరు లేరు. నాకు నటనంటే ప్రత్యేకమైన ఇష్టం లేదు. పరిస్థితుల వల్లే నటుడిగా మారాల్సి వచ్చింది” అని చెప్పారు. ఈ పాడ్‌కాస్ట్‌లో చిరంజీవి సినిమాల్లో కామెడీ ట్రాక్‌ల గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకసారి తాను చెప్పిన కామెడీ లైన్ వల్ల సినిమా హిట్ అవుతుందని భావించారని, కానీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదని గుర్తుచేశారు. ఒక సినిమా విజయం లేదా పరాజయం ఒక్క అంశంపైనే ఆధారపడదని ఆయన అభిప్రాయపడ్డారు.

దర్శకుడిగా మారాలనే ఆలోచనతో తానే నిర్మాతగా కూడా వ్యవహరించానని, అయితే మొదట అనుకున్న కథ షూటింగ్ టైంలో చాలా మారిపోయిందని చెప్పారు. “నేను అనుకున్న కథలో 50 శాతం కూడా చివరికి తెరపైకి రాలేదు” అని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ పోసాని భావోద్వేగానికి గురయ్యారు. “మా నాన్న కూలీ. ఆయన దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో మాకు సహాయం చేసిన బంధువులు ఎవరూ లేరు. తర్వాత నేను స్థిరపడిన తర్వాత చాలా మంది నాతో సహాయం పొందారు” అని చెప్పారు. సినీ పరిశ్రమలో అవకాశాలు ఎలా వచ్చాయో కూడా ఆయన వివరించారు. ఒకసారి పరుచూరి బ్రదర్స్ వారి మధ్యలో తనను కూర్చోబెట్టిన సందర్భంలో తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాననే నమ్మకం వచ్చిందని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని పోసాని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు పంచి గెలవడం తన సిద్ధాంతం కాదని స్పష్టం చేశారు. “ప్రజల సొమ్మును నేను తినను. ప్రజల కోసం పనిచేయడమే రాజకీయాల అసలు ఉద్దేశం” అని వెల్లడించారు. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.