యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలుపెట్టింది. తాజాగా పూజ హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తిచేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
డబ్బింగ్ స్టూడియో లో ప్రేరణ డబ్బింగ్ చెప్తున్న ఫోటోను షేర్ చేస్తూ ” రాధేశ్యామ్ కోసం మా ప్రేరణ డబ్బింగ్ ముగిసింది.. థియేటర్లో జనవరి 14 న కలుద్దాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు సృష్టించనున్నాడో చూడాలి.