కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నర్తన్ దర్శకత్వంలో యశ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడని, ఈ సినిమాలోనే పూజా హీరోయిన్‌గా చేయనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా తేలిపోయింది. యశ్ సినిమా కోసం హీరోయిన్ పాత్రకు పూజాని ఎవ్వరూ సంప్రదించలేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం పూజా హైదరాబాద్‌లో జరుగుతోన్న కభీ ఈద్ కభీ దివాలి సినిమా షూట్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫర్హాద్ సంజీ దర్శకుడు.
అటు.. యశ్ తన తదుపరి సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దర్శకుడు నర్తన్‌తో సినిమా చేస్తున్నట్టు గతేడాది నుంచి వార్తలైతే వస్తున్నాయి కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. దీంతో, యశ్ నెక్ట్స్ సినిమా ఏంటా? అని ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ‘కేజీఎఫ్2’తో యశ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో, నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై చేసేవన్నీ దేశవ్యాప్తంగా విడుదల అవుతాయి కాబట్టి, అందరినీ ఆకట్టుకునే క్రేజీ సబ్జెక్ట్‌తోనే రావాలని నిర్ణయించుకున్నాడు. అందుకే.. కేజీఎఫ్2 రిలీజై ఇన్ని రోజులు అవుతున్నా, తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి, ఈ హీరో ఎప్పుడు తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చేస్తాడో?
ఇదిలావుండగా.. కేజీఎఫ్2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేజీఎఫ్3కి మేకర్స్ శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నారు. సినిమాలోనే మరో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు హింట్ ఇవ్వడంతో, ఆడియన్స్ నుంచి దానికి డిమాండ్ వచ్చిపడింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్3 ఉంటుందని, మేకర్స్ స్పష్టం చేశారు. అయితే, ఎప్పట్నుంచి ఈ సీక్వెల్ ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్‌తోనూ సెట్స్ మీదకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాబట్టి, కేజీఎఫ్3 సెట్స్ మీదకి వెళ్లేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.