Pawan Kalyan Johnny Movie Completed 20 Years: పవర్ స్టార్ గా జనం మదిలో నిలచిన పవన్ కళ్యాణ్ నటునిగా రెండేళ్ళ క్రితమే పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు. తొలినుంచీ సినిమా టెక్నీషియన్ కావాలని అభిలషించిన పవన్ కళ్యాణ్ కు దర్శకత్వం వహించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. 1996లో ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా తెరంగేట్రం చేయగానే సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వరుసగా మరో ఆరేళ్ళు “గోకులంలో సీత, సుస్వాగతం, బద్రి, తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి” చిత్రాలతో హిట్టు మీద హిట్టు చూసుకుంటూ వరుసగా ఏడు హిట్స్ పట్టేశారు పవన్. ‘ఖుషి’ ఆయన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమా విజయోత్సవంలో “ఇకపై మీరు అద్భుతాలు చూడబోతున్నారు” అంటూ అభిమానులను ఉద్దేశించి సెలవిచ్చారు పవన్. ఏ అద్భుతం చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. ‘ఖుషి’ విడుదలైన రెండేళ్ళకు ‘జాని’ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు పవన్ కళ్యాణ్. ఆయనను హీరోగా పరిచయం చేసిన అల్లు అరవింద్ తమ ‘గీతా ఆర్ట్స్’ పతాకంపైనే పవన్ ను దర్శకునిగానూ నిలిపారు. 2003 ఏప్రిల్ 25న ‘జాని’ జనం ముందు నిలచింది. పవన్ ‘బద్రి’ సినిమాలో ఆయనతో కలసి నటించిన రేణూ దేశాయ్ ‘జాని’లో నాయికగా నటించారు. తరువాత ఆయన జీవితభాగస్వామిగానూ మారారు. అందువల్ల ‘జాని’ సినిమా పవన్ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ అనే చెప్పాలి!
ఇంతకూ ‘జాని’ కథ ఏమిటంటే- తల్లి చనిపోవడంతో జాని చిన్నప్పుడే ఒంటరిగా అయిపోతాడు. ధనవంతుడైన తండ్రి తాగుబోతు, మరో ఆమెను పెళ్ళాడడంతో ఆ కుటుంబానికి దూరంగా పారిపోతాడు జాని. ఓ చిన్న క్లబ్ ఫైటర్ గా సాగుతూ ఉంటాడు. ఓ సారి ఒకడిని జాని కొడుతూ ఉంటే, గీత అనే అమ్మాయి చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. తరువాత జాని ఎవరినీ అన్యాయంగా కొట్టడని తెలుసుకుంటుంది. జానిని అపార్థం చేసుకున్నందుకు క్షమించమంటుంది. అలా వారిద్దరి మధ్య స్నేహం, ఆ పై అది ప్రేమగా మారడం, పెళ్ళికి దారితీయడం జరుగుతుంది. పెళ్ళయ్యాక, పోట్లాటలు మానేసి గౌరవంగా బతుకు సాగించాలని ఆశిస్తాడు జాని. ఆనందంగా సాగుతున్న జాని కాపురంలో భార్యకు లుకేమియా ఉందని తెలుస్తుంది. దాంతో తల్లడిల్లిపోయిన జాని, రెండు లక్షల రూపాయల కోసం నానా తంటాలు పడతాడు. ముంబైకి మకాం మారుస్తాడు. అక్కడ భార్య మెడికల్ బిల్ కట్టడానికి పాట్లు పడుతున్న సమయంలో కిక్ బాక్సింగ్ పోటీ కనిపిస్తుంది. అందులో పాల్గొని ప్రాణాలు పణంగా పెట్టి చివరకు విజేతగా నిలుస్తాడు. భార్యకు ట్రీట్ మెంట్ ఇప్పించడానికి ఆ డబ్బుతో ఆసుపత్రిలో ఆమె బెడ్ పైనే పక్కన పడుకుంటాడు. తరువాత జానీ మళ్ళీ పరుగు తీస్తూ పార్క్ లో కనిపించడం, ఆపై భార్యతో పార్కులో కలసి సాగడంతో కథ ముగుస్తుంది.
ఇందులో పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్, గీత, రఘువరన్, మాస్టర్ పంజా వైష్ణవ్ తేజ్, ఆలీ, రజా మురాద్, బ్రహ్మాజీ, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ,సూర్య, సత్య ప్రకాశ్, హరీశ్ పాయ్, ఉస్మాన్, దేవి చరణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చారు. యన్టీఆర్ ‘చిట్టిచెల్లెలు’లో యస్.రాజేశ్వరరావు బాణీల్లో రూపొందిన ‘ఈ రేయి తీయనిది…” పాటను ఇందులో రీమిక్స్ చేశారు. కాగా సీతారామశాస్త్రి, చంద్రబోస్, మాస్టర్జీ పాటలు పలికించారు. ఇందులోని “గో జానీ…”, “రావోయి మా కంట్రీకి…”, “ధర్మార్థ కామములలోన…”, “నారాజు కాకుర అన్నయ్యా…”, “నాలో నువ్వొక సగమై…” అంటూ సాగే పాటలు అలరించాయి.
Read Also: SRH vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఘోర పరాజయం
‘ఖుషి’ తరువాత రెండేళ్ళకు పవన్ నటించిన సినిమా కావడం, అందునా ఆయన దర్శకత్వంలో రూపొందడంతో ‘జాని’ రికార్డ్ బ్రేక్ బిజినెస్ చేసింది. అప్పట్లో రూ.8 కోట్లకు పైగా రైట్స్ అమ్ముడుపోయి టాలీవుడ్ లో చర్చనీయాంశమయింది. 300కు పైగా థియేటర్లలో విడుదలైన ‘జాని’ అభిమానులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఓ.హెన్రీ రాసిన ‘లాస్ట్ లీఫ్’ కథ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఈ ‘జాని’ని రూపొందించారు. ఆయనకు సత్యానంద్ రచనాసహకారం అందించారు. పవన్ దర్శకత్వాన్ని పలువురు ప్రశంసించినా, అంతగా ఆకట్టుకోలేక పోయిందీ చిత్రం! ఇరవై ఏళ్ళ క్రితం ‘జాని’తో దర్శకుడైన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు. ఇరవై ఏళ్ళ దర్శకుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ డైరెక్షన్ చేస్తే సినిమా తీయడానికి ఇప్పుడు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ‘జనసేన’ నాయకునిగా సాగుతున్న పవన్ కు అంత తీరిక దొరుకుతుందా!? అయినా ఆయన సాహసిస్తే, చూడాలనుకొనేవారెందరో ఉన్నారు.